Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల భర్తీ జరిగిందని, ఇది జీర్ణించుకోలేక మాజీ మంత్రి హరీశ్ రావు అవాకులు చెవాకులు పేలుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావుకు ఉద్యోగాలను భర్తీ చేయాలనే లేదని, అందుకే భర్తీ ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలు 12 ఏళ్ల తర్వాత భర్తీ అవుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు.
హరీశ్ రావు కొత్తగా భర్తీ ప్రక్రియలో 1:50 కి బదులుగా 1:100 చేయాలని కోరుతున్నారని, కానీ, ఏదైనా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారమే జరుగుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ 1:100 తీస్తే.. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మళ్లీ స్టే వస్తుందని, ఫలితంగా భర్తీ ప్రక్రియకు బ్రేకులు పడతాయని వివరించారు. అయినా.. ఇతర రాష్ట్రాల్లో 1:50 కాదు కదా.. 1:15 లోపే తీస్తున్నారని వివరించారు. యూపీఎస్సీ నుంచి మొదలు చాలా రాష్ట్రాల్లో 1:15 తీస్తున్నారని తెలిపారు.
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపైనా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఎంత దోపిడీ జరిగిందో అర్థమవుతున్నదని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో విద్యుత్ ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం భావించిందని, కానీ, కేసీఆర్ అడ్డగోలుగా విద్యుత్ ప్లాంట్లు పెట్టి కోట్లు కొల్లగొట్టాడని ఆరోపించారు. సోలార్, విండ్ ప్లాంట్ల ఏర్పాటు చేయకుండా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారని మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లు ఎలా ఇచ్చావని ప్రశ్నించారు. దామరచర్లలో ఎలా ప్లాంట్ పెట్టారని అడుగుతూ.. మెడమీద తలకాయ ఉన్నోడు ఎవ్వరూ ఆ పని చేయరన్నారు.