Politics

Power Corruption: గత సర్కారు తొందరపాటు.. రూ. 81 వేల కోట్ల అప్పులు

Prof Kodandaram: గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ. 81 వేల కోట్ల అప్పులయ్యాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్‌గడ్‌తో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్నది. బీఆర్కే భవన్‌లోని ఈ కమిషన్ కార్యాలయానికి ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. వీరిద్దరి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో చీకట్లు అంటూ కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను నష్టపరిచిందని, అభివృద్ధి పేరుతో నిబందనలను ఉల్లంఘించిందని కోదండరాం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కాదని కేసీఆర్ తొందరపాటు నిర్ణయాలతో ఛత్తీస్‌గడ్‌తో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ తొందరపాటు నిర్ణయాలతో ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ. 81 వేల కోట్ల అప్పులయ్యాయని వివరించారు. థర్మల్ ప్లాంట్ల విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు.

భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చేపట్టారని కోదండరాం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ నీట మునుగుతుందని వివరించారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు.

తాము తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవేనని సమర్థించుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని కోదండరాం చెప్పారు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలను ఆ ప్రభుత్వం చేయలేదని, టెక్నాలజీ అంశాల్లో ప్రభుత్వానికి నష్టమని తెలిసి కూడా దాన్నే ఉపయోగించారని చెప్పారు. చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కారని, నిబంధనలు పాటించనివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరినట్టు తెలిపారు. ఇక విచారణ కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. రెగ్యులేటరీ కమిషన్, అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిధిలో లేవు కాబట్టి కమిషన్ వేయడంలో సమస్య ఏమీ లేదని వివరించారు.

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది