- బీఆర్ఎస్ తీరుతో తెలంగాణ డిస్కంలకు రూ.6 వేల కోట్ల నష్టం
- బహిరంగ మార్కెట్ లో యూనిట్ కరెంట్ రూ.3.90
- కేసీఆర్ సర్కార్ ఒక్కో యూనిట్ 5.64 కు కొనుగోలు
- జ్యుడిషియల్ కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే
- విద్యుత్తు సంస్థల పేరిట రూ. 83 వేల కోట్ల అప్పులు
- భారీగా రూ.60 వేల కోట్లకు పేరుకుపోయిన అప్పులు
- వీటన్నింటినీ కప్పిపుచ్చిన కేసీఆర్
- జ్యుడిషియల్ కమిషన్ కు రాసిన అవాస్తవాల లేఖ
- విద్యుత్ సంస్థను తామే ఉద్ధరించామని చెప్పుకున్న కేసీఆర్
KCR wrote letter to judicial commission hide the facts:
తెలంగాణలో అంతా ఇష్టా రాజ్యమై పదేళ్లపాటు ఆడిందే ఆట పాడిందే పాటగా పాలన సాగించారు గులాబీ బాస్. విద్యుత్ కొనుగోళ్ల అంశం కేసీఆర్ తలకు చుట్టుకునేలా ఉంది. ఇన్నాళ్లూ తెలంగాణ డిస్కంలతో డిస్కో ఆడుకున్న కేసీఆర్ ఛత్తీస్ గఢ్ తో పవర్ కొనుగోలు పేరుతో పైలా పచ్చీస్ గా రూ.3.90 యూనిట్ కరెంట్ ను ఏకంగా 5.64 రూపాయలకు కొనుగోలు చేయడంతో డిస్కంలకు రూ.6 వేల కోట్లు నష్టం వచ్చింది. బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకే ఇస్తున్నా కూడా ఛత్తీస్ గఢ్ కరెంటు కొనుగోలు కు డబుల్ రేట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంత ఎక్కువ?
ఛత్తీస్ గఢ్ కరెంటు కొనుగోలు వలన భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తెలిపాయి. బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకే కరెంటు లభిస్తుండగా అంతకుమించిన సొమ్మును ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్కు రూ.3.90 కే కొనేందుకు ఛత్తీస్ గఢ్ సర్కార్ తో నాటి బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ రీసెంట్ గా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపే అధికారం సదరు కమిషన్ కు ఉండదంటూ అభ్యంతరం లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ తో జరిపిన పీపీఏ, తదనంతర పరిణామాలపై అటు ప్రభువ్వానికి, ఇటు జ్యుడిషియల్ కమిషన్ కు అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. దీనితో తెలంగాణ డిస్కంలు ఛత్తీస్ గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి అయిన ఖర్చు రూ.5.64కు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి. దీనితో డిస్కంలకు రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందని తేల్చాయి.
పదేళ్లలో విధ్వంసం
తెలంగాణ విద్యుత్తు రంగం గడిచిన పదేళ్ల లో విధ్వంసమైంది. విద్యుత్తు సంస్థల పేరిట దాదాపు రూ. 83 వేల కోట్ల అప్పులు తెచ్చారు. మరో రూ.80 వేల కోట్లు సంస్థలు నష్టపోయాయి. దాదాపు రూ.60 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇవన్నీ దాచిపెట్టి విద్యుత్తు వ్యవస్థను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకోవటం.. తెలంగాణ ప్రజల కళ్లకు గంతలు కట్టడం కాదా? విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచినట్లు చెప్పుకోవటం కూడా అతికినట్లు చెప్పిన అబద్ధాల్లో ఇంకొకటి. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగం, సౌరశక్తితో పెరిగిన సామర్థ్యం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తక్కువ. చెప్పుకున్నది ఎక్కువ. 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ హయాంలోనే చేపట్టిన ప్రాజెక్లు బీఆర్ఎస్ పూర్తి చేసింది.
కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ..
సబ్ క్రిటికల్ ప్లాంట్లపై అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని చాంతాడంత వివరణతో సమర్థించుకున్నతీరు జుగుప్సాకరం. బీహెచ్ఈఎల్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించటంలో తప్పేమీ లేదనే మీ వాదన వెనుక రాష్ట్ర ప్రయోజనాలున్నాయా? ఆ పనులు చేపట్టిన సబ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాలున్నాయనే ఆరోపణలకు కేసీఆర్ రాసిన లేఖ జవాబు చెప్పలేకపోయింది. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని ఈ లేఖలో ప్రస్తావించిన తీరు విస్మయం కలిగిస్తోంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్తును 12 ఏండ్ల పాటు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నది మీరే. వెయ్యి మెగావాట్ల విద్యుత్తును తెచ్చుకునేందుకు ఏకంగా రెండు వేల మెగావాట్ల సామర్థ్యముండే లైన్ల కారిడార్ ను ముందుచూపుతో బుక్ చేసింది మీరే. నష్టం లేకపోతే 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్తును ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? చత్తీస్గఢ్ విద్యుత్తును రూ.3.90కే కొనుగోలు చేసినందుకు సంతోషమే. కానీ.. ఈ విద్యుత్తు రాష్ట్రానికి చేరేసరికి ఇంధన సర్ ఛార్జీలు, వాటర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇంటర్ రీజనల్ ఛార్జీలు, కారిడార్ వాడినా వాడకున్నా కట్టిన ఛార్జీలన్నీ కలిపి చత్తీస్ గఢ్ విద్యుత్తు ఒక్కో యూనిట్ రూ.10 దాటిపోయిందనేది వాస్తవం కాదా?
న్యాయ వ్యవస్థపై కేసీఆర్ కన్నెర్ర
లేఖలో కేసీఆర్ అడుగడుగునా కమిషన్ను నిందించారు. స్వచ్ఛందంగా కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డిని డిమాండ్ చేశారు. ఒక రకంగా న్యాయ వ్యవస్థపై తన దురుసుతనాన్ని ప్రయోగించారు. సీఎం హోదాలో ఉన్నప్పుడే ఏకంగా భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని మీడియా సమావేశం పెట్టి డిమాండ్ చేశారు. తనకు అవసరమైన మరో సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామాను రక్తి కట్టించేలా ఆడించిన కేసీఆర్.. దేశంలోని హైకోర్టులు, ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ ఆడియో టేపులను, ఫుటేజీలను పంపించి.. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్కు గౌరవపూర్వకంగా కనిపించిన న్యాయ వ్యవస్థ ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వయిరీలు చేయకూడదని, కనీస ఇంగితం కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తన లేఖలో తప్పుబట్టారు. కానీ.. ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించింది ఈఆర్సీల తీర్పులపై కానే కాదనే విషయాన్ని మరిచిపోయారు. అప్పుడు వన్ మ్యాన్ షోగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటులో జరిగిన అవినీతి అవకతవకలపైనే ఈ కమిషన్ నియామకం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అందుకే ఈ లేఖలో కేసీఆర్ ఊకదంపుడు దబాయింపులు తప్ప వాస్తవాలు లోపించాయి. ఇందులో ఉటంకించిన అంశాలు కూడా నేతి బీరకాయలో నెయ్యిని వెతుక్కున్నట్లుగానే ఉన్నాయి.