Diwali Safty Alert: దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని (Diwali Safty Alert) తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి హాస్పిటల్‌తో పాటు ఇతర ఆస్పత్రులలోని కంటి చికిత్స విభాగాల్లో డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా కంటి గాయాలు, లేదా కాలిన గాయాలతో వస్తే, వారికి తక్షణమే చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైన మెడిసిన్, ఎక్విప్‌మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలని కూడా మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో జ్ఞానం, సంతోషం, శ్రేయస్సు అనే వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలు బాణసంచా విషయంలో జాగ్రత్తలు తీసుకుని, సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, బాంబులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పసి పిల్లలను టపాసులకు దూరంగా ఉంచాలని రాజనర్సింహా సూచించారు.
Read Also- Mysterious Object: విమానం గాల్లో ఉండగా సడెన్‌గా ఢీకొన్న గుర్తుతెలియని వస్తువు.. క్షణాల్లోనే..
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు!
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
సురక్షితమైన ప్రదేశం: టపాసులు కాల్చేటప్పుడు ఇళ్లు, గుడిసెల వంటి మండే స్వభావం ఉండే వస్తువులు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఆరుబయట ప్రదేశాల్లో మాత్రమే క్రాకర్స్ కాల్చాలి. పార్కింగ్ స్థలాలు, వరిగడ్డి, చెత్త పడవేసే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
వ్యక్తిగత భద్రత: టపాసులు కాల్చేటప్పుడు వ్యక్తిగత భద్రత కూడా చాలా ముఖ్యం. వదులుగా ఉండే దుస్తులు (Loose Clothes) ధరించడం అత్యుత్తమం. సింథటిక్ లేదా నైలాన్ దుస్తులు ధరించకూడదు. అంతేకాదు, టపాసులు కాల్చడానికి ముందే పాదరక్షలు ధరించాలి. టపాసులకు ఫైర్ అంటించేటప్పుడు శరీరాన్ని, ముఖాన్ని వీలైనంత దూరంగా ఉంచుకోవాలి.
Read Also- Riaz Encounter: కానిస్టేబుల్ హత్య కేసులో సెన్సేషన్.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్
ముందు జాగ్రత్త: ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి, దగ్గరలో ఒక నీటి బకెట్, లేదా ఇసుక బకెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగినా, వెంటనే స్పందించి ఆర్పివేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక, కాలిపోయిన టపాసుల వ్యర్థాలను ఇసుక, లేదా నీటి బకెట్‌లో వేసి, అవి పూర్తిగా చల్లారిన తర్వాతే వాటిని పడేయాలి.
పిల్లలను గమనిస్తుండాలి: పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. జాగ్రత్తగా గమనిస్తూ, సురక్షితమైన పద్ధతులను నేర్పించాలి. పేలని టపాసులను మళ్లీ కాల్చడానికి ప్రయత్నించకుండా, అడ్డుకొని వాటిని నీటిలో ముంచి పారవేయాలి. ఈ సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే దీపావళిని సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
