Maoist Links: ఇది లొంగిపోయినవారే చెబుతున్నారు
ఎవరెవరికి సంబంధాలున్నాయో విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : తెలంగాణలో అనేకమంది రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు (Maoist Links) ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఈ మాట తాము చెప్పడం లేదని, లొంగిపోయిన మావోయిస్టులే చెబుతున్నారని పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాంచందర్ రావు అధ్యక్షతన ‘సర్దార్ @150’ కార్యక్రమంపై రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించారు.
ఈ సందర్బంగా పార్టీ స్టేట్ చీఫ్ నాయకులు, కార్యకర్తలకు కార్యక్రమ నిర్వహణపై, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరెవరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయో, ఎవరు మావోయిస్టులను పోషించారనే కోణంలో విచారణ చేపట్టి పూర్తి వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని, కానీ ఆ పార్టీ కనీసం ఆయన జయంతిని కూడా నిర్వహించడంలేదని, ఆయన కాంగ్రెస్ నేత అయినా బీజేపీ చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.
హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని విమర్శించారు. కానీ కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. పటేల్ దేశ ప్రజలందరినీ జాతీయ జెండా కిందకు తీసుకువచ్చారని కొనియాడారు. అనేక సంస్థానాలను సర్దార్ పటేల్ భారతదేశంలో భాగం చేశారని వివరించారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర విదేశాలు చేస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ కు ఫండింగ్ చేసి దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఐక్యం చేయాలని సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే అదే పార్టీలో ఉన్న కొందరు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారన్నారు. ఇకపోతే నక్సలిజం సైతం దేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో భాగమేనన్నారు. కేంద్రం నక్సలిజం నిర్మూలనకు కంకణం కట్టుకుందని, త్వరలోనే నక్సల్ రహిత దేశంగా భారత్ మారుతుందన్నారు. అమిత్ షా లో సర్దార్ పటేల్ కనిపిస్తున్నారని రాంచందర్ రావు కొనియాడారు. బీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని, బీసీలను మోసం చేశారని విమర్శించారు.
Read Also- Maoist Surrender: తెలంగాణ ప్రాంత మావోయిస్టుల భారీ లొంగుబాటు!.. ఎప్పుడంటే?
