Parineeti Chopra: బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చడ్డా (Raghav Chadha) దంపతులు తల్లిదండ్రులయ్యారు. వారి ఇంటికి పండంటి మగ బిడ్డ రాకతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 2023 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇప్పుడో అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ శుభవార్తను స్వయంగా ఈ దంపతులు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మా ఇద్దరికీ సర్వస్వం వీడే
బిడ్డ జననం తర్వాత పరిణీతి, రాఘవ్ చడ్డా కలిసి ఒక ఉమ్మడి పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో వారు తమ ఆనందాన్ని తెలియజేశారు. ‘‘చివరికి అతను వచ్చేశాడు, మా బాబు. ఇకపై జీవితాన్ని గుర్తుచేసుకోలేనంతగా మా ఆనందం నిండిపోయింది. ఇప్పటి వరకు మేమిద్దరం ఒకరి కోసం ఒకరం ఉన్నాం. ఇప్పుడు మా ఇద్దరికీ సర్వస్వం వీడే’’ అంటూ వారు పోస్ట్ చేశారు. తమపై చూపిన అభిమానం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ‘విత్ గ్రాటిట్యూడ్, పరిణీతి అండ్ రాఘవ్’ అని సంతకం చేశారు. ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయింది.
సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ
ఈ శుభవార్తపై సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కృతి సనన్, అనన్య పాండే, హుమా ఖురేషీ వంటి బాలీవుడ్ నటీమణులతో పాటు, ఆయుష్మాన్ ఖురానా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆలియా భట్ తల్లి సోని రజ్దాన్ వంటి ప్రముఖులు కామెంట్ సెక్షన్‌లో హార్ట్ సింబల్స్ పంపి, పేరేంట్స్‌గా ప్రమోషన్ పొందిన వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రేమ, బ్లెస్సింగ్స్ చూస్తుంటే.. ఈ జంటపై ప్రజల్లో ఉన్న వారికి ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేస్తున్నాయి.
Also Read- Indian Boycott: టర్కీ, అజర్‌బైజాన్‌లకు బుద్ధి చెబుతున్న భారతీయులు.. ఏం చేస్తున్నారో తెలుసా?
దీపావళి పండుగకు ముందే ఫెస్టివల్
పరిణీతి చోప్రా, రాఘవ్ చడ్డా దంపతులు తమ బిడ్డ రాకను దీపావళి పండుగకు ముందు ప్రకటించడం వారి కుటుంబాలకు, అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంవత్సరం వారికి ఈ బిడ్డ రాకతో పండుగ వాతావరణం రెట్టింపు అయ్యిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఆగస్టు 2025లో ‘1+1=3’ అనే సందేశంతో కేక్ చిత్రాన్ని షేర్ చేస్తూ ఈ జంట తాము పేరేంట్స్ కాబోతున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత, ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అనేక మధుర క్షణాలను పరిణీతి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రేమబంధం నుంచి వివాహబంధంలోకి, ఇప్పుడు మాతృత్వపు ప్రయాణంలోకి అడుగుపెట్టిన పరిణీతి-రాఘవ్ దంపతులు, తమ జీవితంలో అత్యంత విలువైన ఈ బహుమతిని పొందడంతో వారి ఆనందం అవధులు లేకుండా పోయింది. వారి పోస్ట్, తమ బిడ్డే తమకు ఇప్పుడు లోకం, సర్వస్వం అని చెప్పకనే చెబుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
