Govt Employees: సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. తమ తల్లిదండ్రులను సరిగా చూసుకోని, ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) శాలరీలో 10-15 శాతం వరకు కట్ చేసి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పునరుద్ఘాటించారు. ఈ ఆలోచన సామాజిక బాధ్యతను బలోపేతం చేయడానికి, ఆదరణకు కరువయ్యే వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఒక ముందడుగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లిదండ్రులను పోషించడం పిల్లల నైతిక బాధ్యత. వాస్తవానికి ఈ బాధ్యతను ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు. కానీ, నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతుండడం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, కన్నవారి పట్ల పిల్లల నిర్లక్ష్యపూరిత ధోరణిని తగ్గించడం ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మొదలుపెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ చర్యను ప్రభుత్వ ఉద్యోగులతో మొదలుపెట్టడం ద్వారా మిగతా సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
సవాళ్లు, విమర్శలు తప్పవేమో!
జీతం కోత విధానంపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తమ హక్కులపై ఉద్యోగులు మాట్లాడే అవకాశం ఉండవచ్చు. అయితే, ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే మాత్రం జీతాల్లో కోత విధించడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు, తల్లిదండ్రుల పట్ల పిల్లల నిర్లక్ష్యాన్ని చట్టపరంగా ఎలా, ఏవిధంగా నిర్వచిస్తారనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారే సూచనలు ఉన్నాయి. ఇదొక సవాలు మారే ఛాన్స్ ఉంది. దీనిని అధిగమించాలంటే స్పష్టమైన ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రభుత్వం యోచిస్తున్న చట్టాన్ని తీసుకొస్తే, దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత లేదా ఆస్తి తగాదాల కారణంగా తల్లిదండ్రులు, లేదా కుటుంబ సభ్యులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ తరహా చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేస్తారా?, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా విస్తరించాలంటే ఎలా సాధ్యమవుతుందనేది చిక్కుప్రశ్నగా మారవచ్చు.
Read Also- Gadwal News: గద్వాల్లో చివరి రోజు మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
సాధ్యమయ్యే పనేనా?
ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే ఈ తరహా విధానం అమలు చేయడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి చట్టపరమైన ఆధారం, అమలుకు సరైన యంత్రాంగం అవసరం ఉంటుందని అంటున్నారు. ఇందుకు, ప్రభుత్వం ఏ చట్టాన్ని ఆధారం తీసుకోవాలనే విషయానికి వస్తే, తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం, వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లల నుంచి పోషణ (మెయింటెనెన్స్) పొందే హక్కును కల్పిస్తుంది. ఈ చట్టం కింద తల్లిదండ్రులు ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో సవరణలు, కొత్త నిబంధనలను రూపొందించి, ప్రత్యేక చట్టంగా మార్పులు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు, మెయింటెనెన్స్ మొత్తాన్ని ఉద్యోగి జీతం నుంచి నేరుగా కట్ చేసి తల్లిదండ్రులకు చెల్లిస్తున్న విధానాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.
Read Also- CM Revanth Reddy: సీనియర్ ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ?
అమలు చేయడం ఎలా?
ఉద్యోగుల జీతం నుంచి శాలరీ కట్ చేయడం అంటే, అంత సులభమైన ప్రక్రియ కాదు. దీనికి ఒక ప్రామాణిక ప్రక్రియను రూపొందించే అవకాశం ఉంటుంది. ప్రత్యేక ట్రిబ్యునల్, లేదా అధికార వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు స్వీకరణ బాధ్యతలను ఏ స్థాయి అధికారులకు అప్పగించాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన తర్వాత, సదరు ఉద్యోగికి ట్రిబ్యునల్ నోటీసు పంపి, వాదనలు వినడం, అవసరమైతే, వాస్తవ స్థితిపై క్షేత్ర స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవడం వంటి ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం రుజువైన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ ప్రక్రియను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది.
