Damodar Raja Narasimha: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. తెలంగాణలో మత్తు పదార్థాల వ్యసనాన్ని పూర్తిగా అరికట్టాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనపై పోరులో పోలీసు, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో మంత్రి సెక్రటేరియట్‌లో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో టీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, టీఏఎన్‌బీ ఎస్పీ రూపేశ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్, డాక్టర్ అనిత, న్యాయ శాఖ అడిషనల్ సెక్రటరీ సునీత తదితరులు పాల్గొన్నారు.
Also Read: Damodar Rajanarasimha: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పై మంత్రి ఫైర్.. ఎమన్నారంటే..?
మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి సందీప్ శాండిల్య మంత్రికి వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటైన వారిని గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నామని, ఆ తర్వాత వారిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ సహకారం తీసుకుంటున్నామన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం ప్రభుత్వంతో సాధ్యం కాదని, సమాజంలోని అన్ని వర్గాలనూ ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారిలో వచ్చే బిహేవియర్ చేంజెస్ గురించి ప్రతి పేరెంట్‌కు, టీచర్‌కు అవగాహన ఉండాలన్నారు.
అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి
ఈ విషయంలో విస్తృత ప్రచారం జరగాలని మంత్రి సూచించారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, స్కూళ్లు, కాలేజీలు,హాస్పిటళ్లలో రెగ్యులర్‌గా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.అన్ని విద్యా సంస్థల్లో యాంటి నార్కొటిక్స్ వింగ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.డ్రగ్స్ వినియోగం నుంచి బయటపడేసేందుకు అవసరమైన డీ అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
టీచింగ్ హాస్పిటళ్లలో డీఅడిక్షన్ వార్డులు ఏర్పాటు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో డీఅడిక్షన్ వార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని, అలాగే అవసరాన్నిబట్టి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లలను తల్లిదండ్రులే డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకురావాలని మంత్రి కోరారు. పూర్తి ఉచితంగా వారికి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తామని తెలిపారు. పిల్లలకు మత్తు పదార్థాలకు అలవాటైనట్టు గుర్తించాక ఆలస్యం చేయొద్దని, ఆలస్యమయ్యేకొద్దీ వారి ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉన్నదన్నారు.
Also Read: Damodar Raja Narasimha: పరిశుభ్రత పేషెంట్ కేర్‌పై.. ఆరోగ్యశాఖ మంత్రి స్పెషల్ ఫోకస్
