Jugari Cross: ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా నవలలతో సినిమాలు చేశారు. యండమూరి నవలలతో వచ్చిన చిరు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాయి. ఈ మధ్యకాలంలో మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఎక్కడో, ఎప్పుడో ఒకటీ అరా తప్పితే.. నవల ఆధారంగా సినిమాలు రావడం చాలా వరకు తగ్గిపోయింది. మళ్లీ ఈ సంస్కృతికి వెల్‌కమ్ చెబుతూ.. ప్రముఖ రచయిత పూర్ణచంద్ర తేజస్వి (KP Poornachandra Tejaswi) ప్రసిద్ధ నవల అయిన ‘జుగారి క్రాస్’ (Jugari Cross)ను సినిమాగా రూపొందించబోతున్నారు. ‘కరావళి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన దర్శకుడు గురుదత్త గనిగ (Gurudatha Ganiga) ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. ‘కరావళి’ టైటిల్, టీజర్ విడుదలై అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ బి. శెట్టి (Raj B Shetty) ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘కరావళి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో ‘జుగారి క్రాస్’ ఘనంగా ప్రారంభమైంది.
Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!
భారీ యాక్షన్ చిత్రం
‘జుగారి క్రాస్’ అనౌన్స్‌మెంట్ నిమిత్తం మేకర్స్ చిత్ర టైటిల్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ టైటిల్ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన విజువల్స్‌తో పాటు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో టైటిల్ ప్రోమో దుమ్ములేపేలా ఉంది. ఇక ఇందులో చూపించిన పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలు చూస్తుంటే.. ఇదొక భారీ యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనుందనేది అర్థమవుతోంది. రాజ్ బి. శెట్టి తన పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన ఎప్పుడూ కూడా రొటీన్ పాత్రలు కాకుండా.. ప్రత్యేకమైన, అసాధారణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలను అందిస్తుంటారు. చివరగా ‘‘సు ఫ్రమ్ సో’లో గురూజీగా ఆయన చేసిన పాత్ర ఎలాంటి స్పందనను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక త్వరలో రాబోయే ‘కరావళి’లోనూ మరో అద్భుతమైన పాత్రతో మెప్పించనున్నారు. ఇప్పుడు ‘జుగారి క్రాస్’ అనే శక్తివంతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
త్వరలోనే చిత్రీకరణ మొదలు
రాజ్ బి. శెట్టి, గురుదత్త గనిగ కాంబోలో ఇప్పుడే కాదు, ఇకపై కూడా మరిన్ని చిత్రాలు వస్తాయని, వారిద్దరి మధ్య ఉన్న సహకారం అలాంటిదని టీమ్ చెబుతోంది. ‘జుగారి క్రాస్’ టైటిల్ ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని టీమ్ ప్రకటించింది. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘కరావళి’ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక వైపు, ‘జుగారి క్రాస్’ ప్రీ ప్రొడక్షన్ పనులు మరోవైపు అనేలా దర్శకుడు గురుదత్త గనిగ బిజీబిజీగా ఉన్నారు. దర్శకత్వంతో పాటు గురుదత్త గనిగ ‘గురుదత్త గనిగ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కరావళి’ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అభిమన్యు సదానందన్ ‘జుగారి క్రాస్’కు కూడా విజువల్స్ అందిస్తున్నారు. సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
