Jatadhara Trailer: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘జటాధర’ (Jatadhara). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగానూ, అలాగే దీవాళిని పురస్కరించుకుని ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా విడుదల చేశారు. 3 నిమిషాల 1 సెకను నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఒక గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ రాబోతుందనే హింట్‌ని ఇచ్చేసింది. ఈ ట్రైలర్‌లో మొదటి నుంచి ధన పిశాచిగా సోనాక్షి సిన్హా తన విశ్వరూపం ప్రదర్శిస్తే.. ఎండింగ్ షాట్‌లో సుధీర్ బాబు అరిపించేశాడు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- CPI Narayana: బిగ్ బాస్ ఒక వ్యభిచార కొంప.. మరోసారి సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్!
మిస్టరీని ఛేదించే ప్రయత్నం
ట్రైలర్ ఆరంభం నుంచే గ్రిప్పింగ్, భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మొదలైంది. ఇందులో సుధీర్ బాబు అతీంద్రియ పరిశోధకుడిగా (Ghost Hunter) ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఆత్మలు కేవలం శక్తులని, అవి పాజిటివ్ ఎనర్జీస్ అనీ కొందరు భావించినప్పటికీ, హీరో ఎదుర్కొనే శక్తులు చాలా ప్రమాదకరమైనవిగా ఇందులో చూపించారు. ‘అన్ని ఆత్మలు స్నేహపూర్వకంగా ఉండవు. కొన్ని చాలా ప్రమాదకరమైనవి’ అనే డైలాగ్ సినిమా మెయిన్ థీమ్‌ను సూచిస్తుంది. భయంకరమైన ఆత్మలను ఎదుర్కోవడానికి ఘోస్ట్ హంటింగ్ పరికరాలు, సౌండ్ ఫ్రీక్వెన్సీలు వంటి శాస్త్రీయ పద్ధతులను ఇందులో ఉపయోగించినట్లుగా చూపించారు. సైన్స్, అతీంద్రియ శక్తుల మధ్య జరిగే ఘర్షణను, వాటి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేసినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.
సోనాక్షి సిన్హా తాండవం
‘పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి, మంత్రాలతో బంధనాలు వేసేవారు. ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం.. పిశాచ బంధనం’ అంటూ ధన పిశాచిగా సోనాక్షి సిన్హాని పరిచయం చేస్తే, దెయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ధనానికి కాపరిగా ఉంటున్న ఓ పిశాచి యొక్క బంధనం భంగపడింది. ధన పిశాచి పున:రుద్భువానికి కారణమైంది… అని అనగానే ఉగ్రరూపంలో ధన పిశాచిగా సోనాక్షి ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. జంతుబలి, నరబలి వంటివి ఎందుకు ఇస్తుంటారు. ఒక పిల్లాడు కలలోకి వస్తున్నాడని హీరో చెప్పడం, పసిబిడ్డను బలి కోరడం, మానవుల వల్ల కాని బలులు కోరడమే ధన పిశాచి లక్షణం, దాని శక్తి పెరుగుతూనే వస్తుంది.. ఇప్పుడు తారా స్థాయికి చేరే సమయం ఆసన్నమైంది అని స్వామిజీ చెబుతుంటే.. స్క్రీన్‌పై సోనాక్షి తాండవమాడేస్తుంది. ఇక ఫైనల్ షాట్ అయితే, నెత్తురు తాగుతూ సుధీర్ బాబు చేసిన నటనకు థియేటర్లు దద్దరిల్లడం తధ్యం. విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా హై స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా అయితే.. మరో గ్రాండ్ సక్సెస్ రాబోతుందనే హింట్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ట్రైలర్ చూసేయండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
