Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వర్తించి దండిగా అక్రమాస్తులు కూడబెట్టుకుని ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డ ముగ్గురు ఇంజినీర్లకు విజిలెన్స్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. వీరికి సంబంధించిన ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేరుస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఆస్తులకు సంబంధించి ఎలాంటి క్రయ విక్రయాలు జరిపే అవకాశం లేకుండా పోయింది.
57 మందిపై నివేదిక
బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొని లక్ష కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) కట్టింది. అయితే, కట్టిన కొన్నాళ్లకే ఈ ప్రాజెక్టులో భాగమైన మేడగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై ప్రభుత్వం మొదట విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్(PC Gosh) నేతృత్వంలోని కమిషన్‌తో న్యాయ విచారణ కూడా జరిపించింది. ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖకు చెందిన 57 మంది ఇంజినీర్లను బాధ్యులుగా పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. వారంతా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా తెలిపింది.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
రూ.400 కోట్లకు పైనే..
విజిలెన్స్ నివేదికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండీ(MD)గా పని చేసిన భూక్యా హరిరాం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్(Nune Sridhar), మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు(Muralidhar Rao)ల ఇళ్లతోపాటు వారి బంధుమిత్రుల నివాసాలపై ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీల్లో ముగ్గురూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా వెల్లడయ్యింది. బహిరంగ మార్కెట్‌లో ఈ ముగ్గురు అధికారులు అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అప్పట్లో అధికారులు చెప్పారు. తాజాగా ఈ ఆస్తులను విజిలెన్స్ శాఖ నిషేధిత జాబితాలోకి చేర్చింది. దాంతో కోర్టులో కేసులు తేలే వరకు ఆస్తులకు సంబంధించి హరిరాం, శ్రీధర్, మురళీధర్ ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలు లేకుండా పోయింది.
Also Read: Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ నేత సెటిల్మెంట్ హవా.. మిక్కిలినేని నరేంద్రపై ప్రజల ఆగ్రహం!
