Kavitha: విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి సోమవారం ఆమె వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి టీ తాగారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముంది? అని ప్రశ్నించారు.
Also Read: Kavitha: జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ఒత్తిడి చేస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు
పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు?
మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది.ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదు అని నిలదీశారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే కోరుతున్నామన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.
ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు
రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి.. లేదంటే మేము బీహార్ కు వస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నానన్నారు. తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదన్నారు. తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గ్రూప్-1 ఉద్యోగాలు కచ్చితంగా అమ్ముకొని అవినీతి చేశారని ఇవ్వాళ కాకపోయిన సరే రేపు ఈ విషయం బయటపడుతుందన్నారు.
సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. లైబ్రరీ గేటుకు పోలీసులు తాళం వేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రీక్త పరిస్థితులు నెలకున్నాయి. గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు జాగృతి నాయకులను అరెస్టు చేశారు. అనంతరం కవిత వెళ్లి నాయకులను పరామర్శించారు.
Also Read: Kavitha: స్థానికంలో జాగృతి పోటీ?.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయాలనే యోచన
