Digital Payments: దేవాలయాల్లోనూ డిజిటల్ పేమెంట్ (క్యాష్ లెస్) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. భక్తులకు మెరుగైన సేవలతో పాటు, పారదర్శకంగా అందించేందుకు దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. ఈహుండీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి సేవకు ప్రత్యేక డిజిటల్ అకౌంట్(Digital account)లను కేటాయించనున్నది. ఈ విధానంతో లావాదేవీల వివరాలను సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుందని ఎండోమెంట్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆలయాల్లో నగదు రూపంలో జరిగే లావాదేవీల్లో పారదర్శకత లోపించడం, అక్రమాలు చోటు చేసుకుంటుండటం, నకిలీ రసీదులు వెలుగులోకి రావడంతో దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆలయాల్లో జరిగే నిత్యకల్యాణం..
డిజిటల్ చెల్లింపుల విధానంతో ప్రతీ పైసా లెక్క పక్కా ఉంటుందని, ఆలయ అకౌంట్‌లో జమ అవుతుందని, పక్కదారి పట్టే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ-హుండీల ద్వారా భక్తులు తమ కానుకలను నేరుగా క్యూ ఆర్ కోడ్(QR code)తో చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఆలయాల్లో జరిగే నిత్యకల్యాణం, వెండి రథ సేవ, ఆలయ చుట్టు సేవ, వాహన సేవ, పవళింపు సేవ, ఉప ఆలయాల్లో అర్చనలు, గోపూజ, స్పెషల్ దర్శనం, సంధ్యాహారతీ, సువర్ణ తులసీ అష్టోత్తర నామార్చన, సువర్ణ పుష్ప అష్టోత్తరనామార్చన, పట్టాభిషేకం, సుదర్శన హోం, లక్ష్య కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, స్వామివారికి తులసీ మాల అలంకరణ, నిత్య సర్వ కైంకర్య సేవ, నిత్య పూల అలంకరణ సేవ, తులాభారం, సుప్రభాత సేవ ఇలా 23 రకాల సేవలకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీంతో భక్తులు సులువుగా స్వామివారి కైంకర్యాలు చేసుకోవచ్చు.
తొలుత ప్రధాన ఆలయాల్లో…
రాష్ట్రంలో 6541 ఆలయాలకు పైగా ఉండగా 704 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఆర్జేసీ పరిధిలో 3 ఆలయాలు, డీసీ కేడర్ ఆలయాలు 4కాగా 6ఏ ఆలయాలు 123, 6(బీ)- 292, 6(సీ)-261, 6(డీ)-21 ఆలయాలు ఉన్నాయి. తొలుత రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. యాదగిరిగుట్ట(Yadagirigutta), వేములవాడ(Vemulavada), భద్రాచలం(Badhrachelam), బాసర(Basara) ఆలయాల్లో క్యూఆర్ కోడ్ తో డిజిటల్ పేమెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. విజయవంతమైన తర్వాత దశలవారీగా అన్ని ఆలయాలకు విస్తరించాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి సైబర్ ముప్పు వాటిళ్లకుండా.. ఇప్పటికే సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిపారు. మరో వైపు ఆలయాల్లో అన్ని సేవలకు యూపీఐ(UPI), డెబిట్(Debit), క్రెడిట్(Credit) కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం సైతం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Minister Sridhar Babu: వరంగల్ నల్గొండ జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్.. టీ హబ్ తరహాలో ఏర్పాటు!
తొలిసారి మేడారంలోనూ..
మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో క్యూర్ ఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు ప్రాంతాలను సైతం గుర్తించినట్లు సమాచారం. రెండుమూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రతి సేవకూ ఒక క్యూర్‌ఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ సేవకు ఎంత ఆదాయం వచ్చిందనేది స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ దేవాదాయశాఖ మాత్రం ఆదాయం పక్కదారి మళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.
ప్రతీ పైసా దేవుడికి చెందాలనే..
భక్తులు సమర్పించే కానుకలు దేవుడికి చెందాలనే డిజిటల్ పేమెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ప్రతి సేవకు ఒక అకౌంట్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ఏ సేవకు ఎంత ఆదాయం వచ్చిందనేది కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. నగదు రహిత పేమెంట్‌తో అవకతవకలకు అవకాశం ఉండదు. భక్తులకు సైతం నమ్మకం పెరుగుతుంది. వారికి భరోసా కలిగించినట్లు అవుతుందని మంత్రి కొండ సురేఖ అన్నారు.
Also Read: Crime News: మహబూబాబాద్‌లో దారుణం.. బస్సు బోల్తా పడి 30 మందికి తీవ్రగాయాలు
