Telusu Kada Trailer: ‘మిరాయ్’ (Mirai) బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ నుంచి వస్తోన్న చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన (Neeraja Kona) దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో.. ఈ ట్రైలర్ సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్‌ని కలగజేసిందో రివ్యూలో చూద్దాం. ప్రేమ, నియంత్రణ, పవర్ డైనమిక్స్ అనే అంశాలతో ఒక ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Also Read- Nandamuri Balakrishna: బాలకృష్ణకు ‘మంత్రి పదవి డిమాండ్’.. చంద్రబాబు ఒప్పుకోగలరా?.. సమీకరణలు ఇవేనా?
మన కంట్రోల్‌లో ఉండాలి
ట్రైలర్‌ను గమనిస్తే.. భార్య లేదంటే ప్రియురాలి స్థానం గురించి సిద్దు జొన్నలగడ్డ చెబుతున్న పదునైన సంభాషణలతో ట్రైలర్ మొదలైంది. ‘నువ్వు ఏ రోజైతే నీ ఆడదానికి వెళ్లి నీ కన్నీళ్ళు, నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్… పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడ (హార్ట్) మెయింటైన్ అవ్వాలి’ అనే డైలాగ్ ఈ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తుంది. ప్రేమను కూడా మన నియంత్రణలో ఉంచుకోవాలని తెలియజేస్తూ… ‘ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి? అనేది మన కంట్రోల్‌లో ఉండాలి’ అనే డైలాగ్‌తో సిద్దు మైండ్ సెట్‌ని పరిచయం చేశారు. ట్రైలర్‌లోని ప్రధాన ఘర్షణ, నిస్సందేహంగా రాశి ఖన్నా పాత్రతో మొదలవుతుందని తెలిసిపోతుంది. వివాహ బంధంలో స్థిరత్వం గురించి ఆమె అడిగే ప్రశ్నకు సిద్దు పాత్ర ఇచ్చే సమాధానం, నేటితరం ప్రేమలో కచ్చితత్వం లేని భావాలను ప్రతిబింబిస్తుంది.
Also Read- Suresh Gopi: మోదీ కేబినెట్ నుంచి తప్పుకొని.. సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న కేంద్రమంత్రి
నేను సేల్స్ మన్ కాదు
‘నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారెంటీ ఇవ్వగలుగుతావా?’ అని రాశీ ఖన్నా అంటే, ‘నీకు గ్యారెంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మన్ కాదు’ అని చెబుతూనే మరో వైపు శ్రీనిధి శెట్టి పాత్రతో సిద్దులోని మరో కోణాన్ని పరిచయం చేశారు. వారిద్దరితో సిద్దు రొమాన్స్ చేయడం, అందునా ఒకరి ఎదురుగానే మరొకరితో, తర్వాత ఇద్దరితో కలిసి.. మొత్తంగా అయితే ఒక సరికొత్త ప్రేమకథని తెరపై కోన నీరజ ఆవిష్కరించిందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ‘కొంతమంది మీద కొన్ని కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే.. రమ్మంటే వచ్చాయా.. పొమ్మంటే పోవడానికి’ అనే డైలాగ్, విడిపోయిన తర్వాత కూడా మనసులో మిగిలిపోయే శాశ్వత భావోద్వేగాలను తెలియజేస్తుంది. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ క్యారెక్టర్-డ్రైవెన్ డ్రామాగా, ఉన్నతమైన నిర్మాణ విలువలతో, ఆకర్షణీయమైన సంగీతంతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా రూపొందిందనే విషయాన్ని తెలియజేస్తుంది. తెలుగు ప్రేక్షకులు కనుక రిసీవ్ చేసుకుంటే మాత్రం.. స్టార్ బాయ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. చూద్దాం.. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ట్రైలర్‌గా అయితే మాత్రం సినిమాపై భారీగా హైప్‌ని పెంచేలా ఉందనే చెప్పుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
