DCC Posts: అందరి ఆమోదంతో పార్టీ కోసం పనిచేసే వారికే డీసీసీ పదవులు
బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
డీసీసీ ఎన్నికల అబ్జర్వర్, పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వేలు నారాయణస్వామి క్లారిటీ
నాగర్ కర్నూల్, స్వేచ్ఛ: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలుకు కట్టుబడి ఉన్నామని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, డీసీసీ ఎన్నికల అబ్జర్వర్ వేలు నారాయణస్వామి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల డీసీసీ అధ్యక్షుల (DCC Posts) ఎన్నికల కోసం ఏఐసీసీ తనను అబ్జర్వర్‌గా పంపించిందని తెలిపారు. ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఈ నెల 22వ తేది వరకు అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు.
Read Also- SRSP Stage 2: ఎస్సార్‌ఎస్పీ స్టేజ్-2కి పేరు ఖరారు చేసిన సీఎం రేవంత్.. ఎవరి పేరు పెట్టారంటే?
జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని నారాయణస్వామి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
కొందరు కోర్టును ఆశ్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందని, సుప్రీంకోర్టు గతంలోనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చిన తీర్పులు పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆమోదం మేరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే అభ్యర్థులను అందరి ఆమోదంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తామని నారాయణస్వామి స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆదేశాల మేరకు వారే ప్రకటన చేస్తారని వేలు నారాయణస్వామి అన్నారు. ఈ సమావేశంలో అబ్జర్వర్లు బొజ్జ సంధ్యారెడ్డి, సాంబుల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, కోటేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రమణ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Also- Fake Toothpaste: వామ్మో ఇంత మాయాజాలమా?.. టూత్ పేస్టులు వాడేవారికి వణుకుపుట్టింటే విషయం ఇదీ!
