Prisioner Death: బ్లీచింగ్ పౌడర్ తిన్న ఖైదీ
చికిత్స పొందుతూ మృతి
సబ్ జైలు ముందు కుటుంబీకుల ఆందోళన
జనగామ, స్వేచ్ఛ: ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఒకరిని జైలుపాలు చేసింది. దీంతో, ఆ వ్యక్తి మనస్తాపం చెంది సబ్ జైలులోనే ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స పొందుతూ దవాఖానాలో మృతి (Prisioner Death) చెందాడు. ఈ ఘటన జనగామలో జరిగింది. ఖైదీ మృతికి పోలీసుల అత్యుత్సాహం, జైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జైలు ముందు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఖైదీ దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందినవాడని అధికారులు తెలిపారు. వారాల మల్లయ్య అనే వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మచారితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో బ్రహ్మచారి పోలీస్ స్టేషన్‌లో మల్లయ్యపై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 8న కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ చేసిన పోలీసులు సబ్ జైలుకు పంపారు. జైలులో మనస్తాపానికి గురైన మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ తిన్నాడని, జనగామలోని దవాఖానాలో చికిత్స చేయించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడని జైల్ సిబ్బంది చెప్పారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుడి భార్య హైమ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also- Fake Toothpaste: వామ్మో ఇంత మాయాజాలమా?.. టూత్ పేస్టులు వాడేవారికి వణుకుపుట్టింటే విషయం ఇదీ!
‘‘నా భర్త మృతికి పోలీసుల అత్యుత్సాహం, జైల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం’’ అని భార్య హేమ ఫిర్యాదులో పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యులు జైల్ ముందు ఆందోళన చేశారు. ‘‘నాకు ఇద్దరు పిల్లలు. నేను మళ్లీ గర్భవతిని. ఏదో కూలీనాలీ చేసుకొని బతికే నా భర్తను అకారణంగా చిన్నపాటి ఘర్షణకు జైలుకు పంపారు. ఇప్పుడు చనిపోయాడు. జైలు సిబ్బంది నిర్లక్ష్యమే నా భర్త మరణానికి కారణం’’ అంటూ హేమ రోదించింది. కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జనగామ డీసీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ నా భర్త మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల ముందు, వీడియో రికార్డింగ్ చేస్తూ పోస్ట్‌మార్టం చేసి కారణాలు తెలపాలి. నాకు, నా కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని కోరింది. కాగా, జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకోవడంతో జైల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also- Pak Afghan Clashes: పాక్‌పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులు.. ఏకంగా 58 మంది పాక్ సైనికులు మృతి
