– విద్యుత్ అక్రమాలపై కేసీఆర్ వివరణ కోరిన కమిషన్
– వివరణ ఇస్తారా లేక మరింత గడువు కోరతారా?
– గడువు పెంచలేమని ఇప్పటికే స్పష్టం చేసిన కమిషన్
– స్పందించకపోతే సమాన్లేననే ప్రచారం
– కమిషన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
What Will KCR Sir Say? Deadline Ends Today: విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వాలంటూ నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగిసింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు కమిషన్ ఈ నోటీసులను జారీ చేయగా, ఎన్నికల హడావుడి కారణంగా తనకు జులై 30 వరకు గడువు కావాలని కేసీఆర్ కోరగా, అందుకు నిరాకరించిన కమిషన్ జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు నేటితో తీరటంతో నోటీసులపై కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది. కేంద్రం చౌకగా ఇస్తున్న విద్యుత్‌ను కాదని ఛత్తీస్‌ఘడ్ నుంచి కొనటం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో నిబంధనలను తుంగలో తొక్కి తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ కేసీఆర్‌ను వివరణ కోరిన సంగతి తెలిసిందే.
నిపుణులతో చర్చలు
కాగా.. కమిషన్ తనకు పంపిన నోటీసులకు లిఖిత పూర్వక జవాబు పంపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నోటీసులో లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి ఎలా జవాబివ్వాలనే అంశంపై ఇప్పటికే కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ఆయన ఈ నోటీసులకు స్పందించకపోతే, కమిషన్ గడువు మరింత పొడిగిస్తుందా లేదా సమన్లు జారీ చేయటం వంటి నిర్ణయాలేమైనా తీసుకుంటుందా అనే కోణంలో ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
పొడిగింపు లేనట్లేనా?
ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపైనా, రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపైనా, టెండర్ విధానాన్ని పాటించకపోవడంపైనా కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాగా.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉన్నందున జూన్ 15 వరకు అందరూ లిఖిత పూర్వక జవాబు ఇవ్వాలని జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసినందున మరోసారి గడువు పెంపు అవకాశాలు లేనట్లేనని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఆయన జవాబే కీలకం..
ఈ కేసులో ఐఏఎస్ అధికారులు సురేశ్ చందా, అరవింద్ కుమార్ సహా ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీహెచ్ఈఎల్ అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలను తీసుకున్నది. వారు వెల్లడించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ అంతిమంగా కేసీఆర్ వివరణ తర్వాత అంతిమంగా ఒక నివేదికను తయారుచేయనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వివరణే నివేదకకు కీలకం కానుంది.