Kishan Reddy: కిషన్ రెడ్డికి ఇజ్జత్ కా సవాల్!
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి
సొంత సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక
బాధ్యతలన్నీ ఆయనపైనే
అభ్యర్థి ఎంపికలోనూ ఆయనే కీలకం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ
ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించని కాషాయ పార్టీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) సవాల్‌గా మారింది. ఆయన లోక్‌సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. దీంతో ఈ ఎలక్షన్ ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక నుంచి పూర్తి ఎన్నికల బాధ్యతను రాష్ట్ర నాయకత్వం ఆయనపైనే భారం మోపింది. బీజేపీకి సెమీ ఫైనల్‌గా మారిన ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉన్న పూర్తి నమ్మకంతో పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయనపైనే వేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఏ ఒక్క నేత వేలు పెట్టే ధైర్యం చేయడంలేదట. అందుకే ఈ బైపోల్ విషయంలో రాష్ట్ర నాయకత్వం కూడా పేరుకే ముందుంది తప్పితే ఈ బాధ్యత మొత్తం కిషన్ రెడ్డికే అప్పగించింది.
భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికలకు జూబ్లీహిల్స్ బైపోల్ పార్టీకి సెమీ ఫైనల్ భావించాలని నాయకత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ తమ సత్తా చాటితే ఫ్యూచర్‌లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పుంజుకునేందుకు ఆస్కారం ఏర్పడనుంది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానంగా మంచి మైలేజ్ పార్టీకి లభించేందుకు ఆస్కారముందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పదేండ్ల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పలు హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిలైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రజలంతా కాషాయ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకునేందుకు అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ కాషాయ పార్టీ ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ఫైనల్ కూడా చేయడంలో ఆలస్యం వహిస్తుండటంపై అటు ఆశావహులు.. ఇటు శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా కాషాయ పార్టీ అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Read Also- Lulu Mall Controversy: లులూ మాల్‌పై పవన్ కళ్యాణ్ కన్నెర్ర..! మద్దతుగా చంద్రబాబు స్పందన!
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే గ్రౌండ్ లెవల్ కు వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రచారం చేద్దామంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరో కూడా పార్టీ ఫైనల్ చేయకపోవడంతో కార్యకర్తలు స్తబ్ధుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించాయి. నవీన్ యాదవ్ కు కాంగ్రెస్, మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తున్నట్లు స్పష్టంచేశాయి. కానీ బీజేపీలో మాత్రం ఈ అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం. పార్టీలో సరైన అభ్యర్థులు లేక ప్రకటించడంలేదా? లేక ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన వారిని చేర్చుకుని వారికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇంకా ప్రకటించలేదా? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్పన్నమవుతున్నాయి. ఇతర పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత అనౌన్స్ చేయాలని భావించినా ఇప్పటికే అవి తమ అభ్యర్థులను ఫైనల్ చేశాయి. అయినా కాషాయ పార్టీ ప్రకటించడం వెనుకున్న ఆంతర్యమేంటనేది తెలియడంలేదు. కాగా ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా వెళ్లాలని భావిస్తున్నాయి. మరి బీజేపీ అభ్యర్థిని ఎప్పుడు ఫైనల్ చేయనుంది? ప్రచారం పర్వం ఎప్పటి నుంచి ప్రారంభించనుందనేది చూడాలి.
Read Also- Gadwal Collector: అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల నేతలకు ప్రతి ఒక్కరూ కనీసం 2 గంటలు సమయమిచ్చి ప్రచారంలో విస్తృతస్థాయిలో పాల్గొనాలని సూచించింది. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడంతో అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆశావహులు టికెట్ ఎవరికి వస్తుందోనని ఇప్పటికే తీవ్ర ఉత్కంఠతో వేచిచూస్తున్నారు. జూబ్లీహిల్స్ బాధ్యతలను మోస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైకమాండ్ కు ఎవరి పేరును ఫైనల్ చేయమన్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీకి ప్రధానమైన పిల్లర్లలో ఒకరిగా చెప్పుకునే కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో తన మార్క్ చాటి పార్టీని విజయతీరాలకు చేర్చుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
