The Scene Of The Movie Drishyam In Jalasoudha
Politics

Kaleshwaram Project: జలసౌధలో ‘దృశ్యం’ సినిమా సీన్

The Scene Of The Movie Drishyam In Jalasoudha: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం కూడా తన విచారణను కొనసాగించింది. హైదరాబాద్ జలసౌధలో కమిషన్ ఛైర్మన్ ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజినీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలోని ఇంజినీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ వారిని విచారించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన వేసిన ప్రశ్నలకు పలువురు అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం.

జవాబు లేని ప్రశ్నలు?

శుక్రవారం నాటి విచారణలో కమిషన్.. అధికారులను 4 ప్రధాన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అవి..
1) గోదావరిలో ఇంత నీరు పారుతుంటే.. దీనిని వదిలిపెట్టి, ప్రాణహిత నదీ జలాలను ఎత్తి పోయాలనే ఆలోచన ఎవరిది?
2) ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను నాటి ప్రభుత్వం ఎందుకు పక్కనబెట్టింది?
3) కేవలం మూడు నెలల పాటు నీటిని ఎత్తిపోయటానికి ఇంత ఖరీదైన, పెద్ద ప్రాజెక్టు దేనికి?
4) హడావుడిగా ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబితే.. నిపుణులుగా మీరు వాటిని ఎలా పాటించారు?

ఒకేమాట మీద ఉందాం..

కమిషన్ చేపట్టిన విచారణలో ఇద్దరు సీనియర్ అధికారులు సహాయ నిరాకరణకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 7వ తేదీన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇంజినీర్లను కమిషన్ విచారణకు పిలిచింది. అయితే, అంతకు ఒకరోజు ముందు.. ఒక సీనియర్ ప్రభుత్వ ఇంజనీర్, మరొక అధికారి కలిసి .. కొందరు ఇంజనీర్లతో 45 నిమిషాల పాటు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, కమిషన్ ముందు అందరూ ఒకే రకంగా జవాబులివ్వాలని చెప్పినట్లు సమాచారం. అయితే.. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ దృష్టికి రావటంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది సరైన పద్ధతి కాదని కమిషన్ ఆ అధికారులను మందలించినట్లు తెలుస్తోంది.

ఎవరు ఆ ఇద్దరు?

ఈ విచారణలో కమిషన్‌కు సాయంగా ఉండేందుకు మే 22న ఏర్పాటు చేసిన నలుగురు నిపుణుల కమిటీ ఏర్పడింది. అందులో కన్వీనర్‌గా ఇంజనీర్ ఇన్ చీఫ్‌(జనరల్)గా ఉండగా, మరో సభ్యుడిగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగపు ఇంజనీర్ ఇన్ చీఫ్‌ ఉన్నారు. వీరిద్దరే టెలీకాన్ఫరెన్స్‌లో కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడికావటంతో అటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిషన్ సూచన మేరకు.. వారిద్దరినీ విచారణకు దూరంగా ఉంచాలని కూడా నీటి పారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం పీసీ ఘోష్‌ నిర్వహించిన సమావేశంలో సైతం ఈఎన్సీ హాజరు కాలేదని తెలిసింది.

అఫిడవిట్ల సేకరణ!

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు హాజరైన వారి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అఫిడవిట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నివేదికలు 27న అందనున్నాయి. జులై 7న ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్, సీఎస్ఎంఆర్ఎస్ నివేదికలు కూడా కమిషన్‌కు అందనున్నాయి. ప్రధానంగా ఆర్థిక అంశాలపైనే దృష్టి సారించిన కమిషన్ ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తోంది. వాళ్లు ఇచ్చే వివరణను అఫిడవిట్ల రూపంలో తీసుకోనుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులను విచారించిన పీసీ ఘోష్ కమిషన్ బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన ప్రజాప్రతినిధులను విచారించబోతున్నది.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?