Heli Tourism: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తుంది. పర్యాటకుల అభిష్టం మేరకు టూరిజం శాఖ సైతం హెలీ టూరిజంను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. ప్రైవేటు ఎయిర్ లైన్స్ కంపెనీలతో పలుమార్లు చర్చలు సైతం జరిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ప్రతిపాదనలు సిద్ధం
గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటకశాఖ ఇందుకు ప్లాన్ సైతం సిద్ధం చేసింది. ‘ఈజ్ మై ట్రిప్’ సంస్థతో పాటు ప్రైవేటు ఎయిర్ లైన్స్ కంపెనీలు సైతం ముందుకు వచ్చాయి. పర్యాటకశాఖతో పలుమార్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా తిరిగి హైదరాబాద్ కు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందించారు. దీని వల్ల తెలంగాణ పర్యాటక రంగం కొత్తమలుపు తిరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఏపీ సర్కార్‌తో సమన్వయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి హెలీ టూరిజంకు రూపకల్పన చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండు ప్రభుత్వాల సమన్వయంతోనే హెలీ టూరిజంను సక్సెస్ చేయబోతున్నారు. శ్రీశైలం ఏపీ ఆధీనంలో ఉండటంతో ఈ నిర్ణయంను తెలంగాణ తీసుకున్నట్లు సమాచారం. నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి అందాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే టూరిజం శాఖకు ఆదాయం పెరగనుంది.
జనవరి ఫస్ట్ వీక్ లేదా సంక్రాంతి
హెలీ టూరిజంను వచ్చే ఏడాది జనవరి మొదటి వారం లేకుంటే సంక్రాంతి నుంచి ప్రారంభించేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతుంది. వారాంతపు రోజుల్లో తొలుత హెలీ కాప్టర్ సర్వీసు నడుపాలనిభావిస్తుంది. త్వరలోనే మరోమారు ఎయిర్ లైన్స్ కంపెనీతో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో పర్యాటక రంగానికి కొత్త ఊపిరిపోయనుంది. పర్యాటకులకు ప్రపంచ స్థాయి వాయు ప్రయాణ అనుభవం కలుగనుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పచ్చని అరణ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కలగలిపిన తెలంగాణ ఎప్పటినుంచో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు హెలికాప్టర్ పర్యాటకం ద్వారా, ప్రత్యేకంగా శ్రీశైలం వైపు ప్రయాణించే వారికి సరికొత్త సౌలభ్యం, విలాసవంతమైన అనుభవం కలుగనుంది. మల్లికార్జున జ్యోతిర్లింగ ఆలయం, అద్భుతమైన శ్రీశైలం డ్యామ్ ఉన్న ఈ పవిత్ర ప్రదేశానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. ఈ హెలీ టూరిజం స్టార్ట్ అయితే ఇకపై హెలికాప్టర్ రైడ్ ద్వారా నల్లమల అరణ్యాలు, కృష్ణా నది, కొండలు పైనుంచి చూసే అనుభూతి కలుగనుండటంతో పర్యాటకులు సైతం ఆసక్తి చూపే అవకాశం ఉంది.
6-8 కూర్చొని వెళ్లేలా ప్లాన్..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే సుమారు 5 నుంచి 6 గంట సమయం పడుతుంది. అదే హెలీకాప్టర్ లో వెళ్తే ఒక గంటలోపు వెళ్లే అవకాశం ఉంటుంది. శ్రీశైలం, ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులు అందరికీ వారాంతపు పర్యటనలకు సరైన గమ్యస్థానంగా మారనుంది. ఒక్కో హెలికాప్టర్ లో 6 నుంచి 8 కూర్చొనేలా సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అదే విధంగా ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీలతో భాగస్వామ్యాలు చేసి, భద్రత, ధరల సౌలభ్యం, నాణ్యమైన సేవలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే పర్యాటకరంగంలో 15వేలపెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో దేశానికి ఒక ఇన్నోవేటివ్ టూరిజం మోడల్గా నిలువబోతుంది.
Also Read: TG High Court: స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ మెలిక పెట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సర్కార్!
త్వరలోనే ధరలు ప్రకటన
ఈ హెలీ టూరిజం రెండు నుంచి మూడ్రోజుల టూర్ కు పర్యాటకశాఖ ఏర్పాటు చేస్తుంది. అందుకు కావల్సిన సదుపాయాలను సైతం పర్యాటకులకు కల్పించనున్నారు. అన్ని ఇన్ క్లూడ్ చేసి త్వరలోనే ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. హెలీ కాప్టర్ బూకింగ్ చేసుకునేందుకు టూరిజం సైట్ లేదా యాప్ ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ శ్రీశైలం టూర్ సక్సెస్ అయితే ములుగు జిల్లాలోని లక్నవరం కు వరంగల్, ఇలా పలు ప్రాంతాలకు సైతం హెలీ కాప్టర్ సదుపాయం కల్పించబోతున్నారు. ఏదీ ఏమైన ప్రభుత్వం హెలీ టూరిజంతో నూతన ఒరవడి సృష్టించబోతుంది.
