- అటు సినిమాలు, ఇటు రాజకీయాలలో దూసుకుపోతున్న బాలకృష్ణ
- హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన బాలయ్య
- బాబు క్యాబినెట్ లో ఈ సారి కూడా దక్కని పదవి
- తొలి సారి ఎమ్మెల్యే అయినవారికి సైతం ఛాన్స్
- మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్యకు మొండిచెయ్యి
- మంత్రి పదవికి బాలయ్య పనికిరాడా అని గుర్రుమంటున్న బాలయ్య అభిమానులు
- ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రులైతే విమర్శలు వస్తాయంటున్న పార్టీ శ్రేణులు
Balakrishna Hattrick Mla not become minister in chandra babu cabinet:
నందమూరి ఫ్యామిలీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సీనియర్ ఎన్టీఆర్..ఆ తర్వాత బాలకృష్ణ. పెద్దాయన సినిమాలలో రాణించి తర్వాత రాజకీయంగా రాణించారు. బాలయ్య కూడా అదే పంధాలో ముందుగా సినిమాలలో ఆ తర్వాత రాజకీయాలలో రాణిస్తూ వస్తున్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక జానర్లలో ఎన్టీఆర్, బాలయ్యలు చేయని పాత్రలు లేవంటే అతిశయోక్తి కాదు. పైగా అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ అసమాన రికార్డులు సొంతం చేసుకుంటున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల వరుస విజయాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు. అటు రాజకీయ పరంగానూ మూడో సారి హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఇన్ని పాత్రలలో రాణిస్తున్న తమ అభిమాన హీరో బాలయ్యను ఓ పాత్రలో చూడాలని అనుకుంటున్న ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తున్నాడు బాలకృష్ణ. అదే మంత్రి పదవి….రాష్ట్రమంతా కూడా జగన్ హవా నడిచినప్పుడు కూడా బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు.
2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పటికే బాబు క్యాబినెట్ సిద్ధం అయింది. తొలి సారి ఎమ్మెల్యేగా పోటీచేసిన వారికి సైతం మంత్రి పదవులు వచ్చాయి. ఈ సారి కూడా బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు.
హ్యాట్రిక్ విజయాలు
బలమైన రాజకీయ వారసత్వంతో పాటు అటు సినీ హీరోగా విజయాలు దక్కించుకుంటూ హ్యాట్రిక్ కొట్టి రాజకీయాల్లో విజయాలనే చవి చూస్తున్న బాలయ్యకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య మంత్రి కావడానికి అర్హుడు కాదా అని అంటున్నారు. నిజానికి ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను చూసి అతడే నా రాజకీయ వారసుడు అని మదనపల్లి సభలో ప్రకటించేశారు. ఇది 1987లో జరిగిన ముచ్చట. ఆనాడు బాలయ్య హీరోగా ఉంటూనే టీడీపీ కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ పాల్గొన్న సభలో బాలయ్య ప్రసంగించిన తీరుని చూసిన ముచ్చట పడిన అన్న గారు అన్న మాటలు ఇవి. అంటే పెద్దాయనకు బాలయ్య రాజకీయంగా అందలాలు ఎక్కాలని కోరిక ఉందని అర్ధం అవుతోంది. అయితే బాలయ్య కాస్తా లేటుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
అడ్డొస్తున్న సామాజిక సమీకరణాలు
వాస్తవానికి బాలయ్య 2014లోనే మంత్రి అయి ఉండాల్సింది. కానీ ఆనాడు దక్కలేదు. ఇక 2019లో చూస్తే టీడీపీ ఓటమి పాలు అయింది. 2024లో పార్టీ గెలిచింది బాలయ్యకు ఎదురులేదు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన పేరు ఏ దశలోనూ పరిశీలనలో లేదు అని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ తో పాటు బీసీ మహిళా నేత ఎస్ సవితకు చాన్స్ ఇచ్చారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కి మంత్రి పదవి దక్కింది. బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటే సామాజిక వర్గ సమీకరణలు అడ్డు వస్తున్నాయని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల పయ్యావుల కుటుంబాలు రాజకీయంగా గట్టిగా ఉన్నాయి. పయ్యావుల మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తొలిసారి మంత్రి అయ్యారు. ఆయనకు ఇవ్వడం సముచితం. దాంతో బాలయ్యకు దక్కలేదు అని అంటున్నారు.
ఎమ్మెల్యేగానే ఉండిపోతారా?
ఇక విస్తరణలో ఏమైనా మార్పు చేర్పులు ఉంటే బాలయ్యకు మంత్రి యోగం ఉంటుందా అంటే అది కూడా డౌటే అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికే చంద్రబాబు నారా లోకేష్ ఉన్నారు. బాలయ్యని కూడా తెస్తే కుటుంబం మొత్తం ఉన్నారు అని అంటారు. దాంతో బాలయ్యా ఇక ఇంతేనయ్యా అని అనుకోవడం అభిమానుల వంతు అవుతోంది. బాలయ్య తెలుగుదేశం పార్టీకి గత నాలుగు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1984 నుంచి మొదలుపెట్టి లోక్ సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల దాకా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం బాలయ్య బాగా కష్ట పడుతున్నారు అని అంటున్నారు. మరి బాలయ్యకు ఈ దఫా కనుక మంత్రి పదవి దక్కకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 69 ఏళ్ళు వస్తాయి. మరి ఆయన పోటీ చేస్తారో కూడా తెలియదు. దాంతో జస్ట్ ఎమ్మెల్యేగానే అన్న గారి వారసుడు పొలిటికల్ గా మిగిలిపోతారా అన్న చర్చ కూడ సాగుతోంది