Cough Syrup: దగ్గుమందు తాగి చిన్నారులు మరణిస్తున్న ఘటనలు దేశంలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో మరో రెండు దగ్గు మందు విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ కు చెందిన రిలైఫ్ సీఎఫ్ (Relife CF), రెస్పి ఫ్రెష్- టీఆర్ (Respifresh -TR) సిరప్‌లను రాష్ట్ర ప్రజలెవరూ కొనుగోలు చేయవద్దని సూచించింది. ఆ సిరప్ లలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజాగా నిషేధించిన రెండు సిరప్ లలో డైఇథిలిన్ గ్లైకోల్ (Diethylene Glycol) అనే అత్యంత విషపూరితమైన కెమికల్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వాటి వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి ప్రజలు.. ఈ రెండు దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సిరప్ లను మెడికల్ స్టోర్స్ లో విక్రయించడానికి వీల్లేదని స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే దేశంలో కోల్డ్ రిఫ్ సిరప్ ను నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్ర విభాగం (DCA) ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ దానిపై బ్యాన్ విధించారు.
Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రుల మధ్య సయోధ్య.. విభేదాలను చక్కదిద్దిన టీపీసీసీ.. వివాదం ముగిసినట్లే!
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండేళ్ల లోపు పసిపిల్లలకు దగ్గు సిరప్‌లను (Coldrif Warning) ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ సోమవారం సూచించారు. ఐదేళ్ల లోపు వాళ్లకు కూడా అత్యవసరానికి మాత్రమే వాడాల్సి ఉంటుందని, అది కూడా చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలని సూచించారు. తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్ సిరప్’ (Coldrif Syrup) కల్తీ అయ్యిందని ప్రకటించారు. దాన్ని రాష్ట్రంలో ఎవరూ వాడొద్దని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు, జిల్లా వైద్యాధికారులకు సర్క్యాలర్ పంపించారు.
