Adluri Laxman vs Ponnam: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వివాదానికి ముగింపు పడింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో భేటి అయిన ఇద్దరు మంత్రులు.. తమ మధ్య తలెత్తిన వివాదానికి చెక్ పెట్టారు. ‘దున్నపోతు’ అంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి అడ్లూరికి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. దీనిని అడ్లూరి స్వాగతించడంతో రెండ్రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమస్యకు పరిష్కారం లభించినట్లైంది.
క్షమాపణలు చెప్పిన పొన్నం
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రుల మధ్య చెలరేగిన వివాదం కాంగ్రెస్ ను తీవ్ర ఇరాకటంలో పడేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఇద్దరు మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ సమక్షంలో మంత్రి పొన్నం.. అడ్లూరికి సారీ చెప్పారు. తాను మంత్రిని ఉద్దేశించి ఆ మాట అనకపోయినప్పటికీ పత్రికల్లో వచ్చిన కథనాలతో అడ్లూరి మనస్థాపం చెందారని పొన్నం అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ‘నా క్షమాపణలు’ అని తెలియజేశారు. అడ్లూరికి తనకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం ఉండదని.. కాంగ్రెస్ నేతలమంతా సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా పొన్నం వ్యాఖ్యానించారు.
మేమంత్న ఐక్యంగా – సామాజిక న్యాయం కోసం! pic.twitter.com/QUMJKR8vDC
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 8, 2025
అడ్లూరి రియాక్షన్ ఏంటంటే?
మరోవైపు పొన్నం క్షమాపణలు చెప్పడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. సహచర మంత్రి సారీ చెప్పడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని అన్నారు. అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అడ్లూరి స్పష్టం చేశారు. పార్టీ జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. తాను పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదన్న అడ్లూరి.. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పట్ల తన మాదిగ జాతి బాధపడిన మాట వాస్తవేమనని అన్నారు. మెుత్తం మీద పొన్నం ప్రభాకర్ పై తనకున్న గౌరవం అలాగే ఉంటుందని అడ్లూరి స్ఫష్టం చేశారు.
Also Read: BSNL Rs 225 Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ.225కే రోజూ 2.5 జీబీ డేటా.. 350కిపైగా లైవ్ ఛానల్స్!
‘మంత్రులు బాధ్యతగా మాట్లాడాలి’
మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య సయోధ్య కుదిరిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం యావత్ సమాజాన్ని బాధించింది. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్య. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. పొన్నం, అడ్లూరి ఇద్దరూ కష్టపడి పైకొచ్చిన నేతలే. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. సహచర మంత్రులు కూడా ఎక్కడ మాట్లాడినా.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని టీపీసీసీ చీఫ్ సూచించారు.
