Adluri Laxman vs Ponnam: తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎపిసోడ్ కాంగ్రెస్ కు ఊహించని తలనొప్పిని తీసుకొచ్చింది. దున్నపోతు అంటూ పొన్నం చేసిన పరోక్ష వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. పొన్నం క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని సైతం ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సహా టీసీపీసీ చీఫ్ ఆగ్రహంగా ఉండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దిగొచ్చారు. వ్యాఖ్యల వివాదంపై ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు.
పొన్నం ఏమన్నారంటే?
సహచర మంత్రితో చోటుచేసుకున్న వివాదం గురించి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా స్నేహబంధం ఉంది. రాజకీయాలకు అతీతంగా మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు’ అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
‘నా మనసు నొచ్చుకుంది’
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా.. బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా తనకు ఇంకొకరిపై ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండవని పొన్నం అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. దాంతో అపార్థాల ఏర్పడి అన్నలాంటి అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకుందని పేర్కొన్నారు. ఇది తెలిసి తానూ తీవ్రంగా విచారిస్తున్నట్లు చెప్పారు.
‘కలిసికట్టుగా సాగుదాం’
‘అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడానికి కృషి చేద్దాం. సామాజిక న్యాయం సాధనలో ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ తాజా ప్రకటనలో చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటన ద్వారా అడ్లూరితో తలెత్తిన వివాదానికి ముగింపు పలకాలని పొన్నం భావించినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.
మంత్రులతో టీపీసీసీ చీఫ్ భేటి
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బయటపడటంతో.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరు మంత్రులతో ఆయన ఇప్పటికే ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు ఇవాళ (బుధవారం) మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ తో ఆయన భేటి కాబోతున్నారు. మరోవైపు మంత్రి పొన్నంపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీని కలిసి మాదిగ ఎమ్మెల్యేలు కోరడం గమనార్హం. మెుత్తం మీద ఇద్దరి మధ్య వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెుత్తం మంత్రుల ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సైతం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Heavy Traffic Jam: దేశంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా రోడ్లపైనే వాహనదారులు.. మ్యాటర్ ఏంటంటే?
ఎన్నికల ముందు కుల వివాదం..?
మంత్రి పొన్నం వర్సెస్ మంత్రి అడ్లూరి ఎపిసోడ్ కులాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఎస్సీ, బీసీ నేతల మధ్య విబేధాలను సృష్టించినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు సమస్యలు ఉండగా, కొత్తగా ఈ సమస్యను సృష్టించడం ఏమిటని? సొంత పార్టీ నేతలు అసహానాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనతో కాంగ్రెస్ పార్టీ మరింత మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మంత్రుల మధ్య వివాదం కొత్త సమస్యకు దారి తీసింది.
