– వర్షాలు వస్తున్నాయి.. అలర్ట్‌గా ఉండాలి
– వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించాలి
– వెంటనే సిబ్బంది వెళ్లేలా చూడాలి
– వారం రోజుల్లో అన్ని వార్డుల్లో పర్యటిస్తా
– వర్షాలు, వరదలతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు
– జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
– అధికారులకు కీలక ఆదేశాలు
Rain Review: వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పరిష్కరించేలా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. రాబోయే వన మహోత్సవంలో హైదరాబాద్ గ్రీన్ సిటీగా ఉండేలా ముందుకు వెళ్దామని నిర్ణయించారు. వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించి వర్షం పడిన వెంటనే అక్కడకి సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్‌కి సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే, దోమలు లేకుండా చూసుకోవాలన్న మంత్రి, అప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వ పక్షాన జీహెచ్ఎంసీకి సహకారం అందిస్తామని చెప్పారు.
ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ముందుకు వెళదామని పార్టీలకు, కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు పొన్నం. చెరువులను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్తలు చేపట్టాలని, ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. వారం రోజుల్లో జిల్లా మంత్రిగా అనేక వార్డుల్లో, డివిజన్లలో తిరుగుతూ ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు పొన్నం ప్రభాకర్. ప్రజలు ఎలాంటి సూచనలు చేసినా తాము స్వీకరిస్తామని, వరదలు, వర్షాల వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలాల్లో సిల్ట్ తీయడంపై గతంలో ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు అలా జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్నల్ రోడ్లు డ్యామేజ్ లేకుండా చూడాలని, మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు పొన్నం ప్రభాకర్. బక్రీద్‌కి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, బోనాలకి సంబంధించి మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశానికి మేయర్ విజయలక్ష్మి, అధికారులు సహా పలువురు హాజరయ్యారు.