Jubilee Hills Bypoll: ఉపఎన్నిక నిర్వహణకు సర్వం సిద్దం
జూబ్లీహిల్స్ మొత్తం ఓటర్లు 3 లక్షల 98 వేల 982 మంది
139 లొకేషన్లలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు
జూబ్లీహిల్స్‌లో పార్టీల ప్రచార సామగ్రిని తొలగిస్తున్నాం
కట్టుదిట్టంగా కోడ్ అమలుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు
ముగిసిన ఫస్ట్ లెవల్ ఈవీఎంల చెకింగ్
త్వరలోనే సెకండ్ లెవల్ టెస్టులు
జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) సాఫీగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ. కర్ణన్ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల కమిషనర్ కర్ణన్ మాట్లాడారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణను విజయవంతంగా నిర్వహించామని, అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధుల అభ్యంతరాలను, సలహాలను పరిగణలోకి తీసుకుని గత నెల 30వ తేదీన నియోజకవర్గం ఓటర్ల తుది జాబితాను విడుదల చేశామని, వీటిల్లో మొత్తం ఓటర్లు 3 లక్షల 98 వేల 982 తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు ఇదివరకే ప్రకటించినా, ఇంకా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినందున ఈ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య నాలుగు లక్షల పై చిలుకుగా ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లను కూడా ర్యాండమైజేషన్ చేసి, 407కు పెంచినట్లు వివరించారు. సుమారు 139 లొకేషన్లలో ఈ పోలింగ్ స్టేషన్లున్నాయని వివరించారు.
Read Also- ATA Dussehra Celebrations: అమెరికాలో అలరించిన ‘ఆట’ దసరా వేడుకలు
సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ జారీ కావటంతో వెంటనే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని కమిషనర్ కర్ణణ్ ప్రకటించారు. కోడ్‌ను ఖచ్చితంగా, పకడ్బందీగా అమలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓ దఫా ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ పూర్తయినట్లు, త్వరలోనే రెండో లెవెల్ చెకింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఏర్పాటు చేసిన రకరకాల ప్రచార సామగ్రిని తొలగిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించగా, వివిధ రాజకీయ పార్టీలు బూత్ లెవెల్‌లో పోలింగ్ ఏజెంట్లను నియమించినట్లు కమిషనర్ వివరించారు. ఈ ఎన్నికకు 600 మంది ప్రెసైడింగ్ ఆఫీసర్లను, మరో 600 మందిని అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లను నియమించామన్నారు. గత నెలాఖరులో జారీ చేసిన నియోజకవర్గం ఓటర్ల తుది జాబితాలో ప్రతి ఓటరు తమ వివరాలను వైరిపై చేసుకోవాలని, ఏమైనా మార్పులు అవసరమైనా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. ఓటర్ సమాచార వెరిఫై కోసం 1950కి ఫోన్ చేసి చెక్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గురించి తెల్సుకునేందుకు నో యువర్ క్యాండీడెట్‌ను కూడా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే వారెంతటి వారైనా చట్టపరమైన కేసులు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో ఎపిక్ కార్డుతో పాటు భారత ఎన్నికల సంఘం ఆమోదించిన మరో 12 రకాల ఐడెంటిటీ పత్రాలతో ఓటర్లు తమ హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు.
Read Also- Pharma Hub: ఫార్మా రంగంలో మరో మైలురాయి.. రూ.9 వేల కోట్ల పెట్టు బడులకు అమెరికా కంపెనీ అంగీకారం
ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటో
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఈవీఎంపై అభ్యర్థి కలర్ ఫొటోను ఓటరుకు కన్పించేలా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అభ్యర్థి కలర్ ఫొటో ఏర్పాటు చేయాలన్న నిబంధన ఈ ఉప ఎన్నికకు కూడా వర్తిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా కర్ణన్ తెలిపారు.
సంఘ విద్రోహక శక్తులపై నిఘా: పోలీసు కమిషనర్ సజ్జనార్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించటంలో భాగంగా సంఘ విద్రోహాక శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నియమ నిబంధనలను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యంగా మద్యం, నగదు పంపకాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయుధాల లైసెన్స్ కల్గిన వారంత నిర్ణీత సమయంలోపు తమ ఆయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ తో పాటు ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న సభలు, సమావేశాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్లు, ప్రతి కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
