Harish Rao: రాష్ట్రంలో ఎక్కడైనా సీఐ, ఎస్ఐలు బెదిరించినా.. అక్రమ కేసులు పెట్టినా.. వారి పేర్లను ‘పింక్’ బుక్కులో రాయాలని మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ఇవాళ ప్రతీ ఒక్కరు ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అంటున్నారని హరీశ్ రావు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మోసాలను బట్ట బయలు చేసేందుకు ఇంటింటికి బాకీ కార్డులను బీఆర్ఎస్ పంచుతోందని హరీశ్ రావు అన్నారు.
‘ఓటు కోసం వస్తే నిలదీయండి’
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి కనీసం 20 వేలు కూడా కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోయిందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రూ.33వేల కోట్ల రుణమాఫీ కేసీఆర్ చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.19వేల కోట్లే చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే గట్టిగ నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని చేతగాని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం తప్ప కొత్తగా చేసిందేం లేదన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని మరో కొత్త మోసానికి కాంగ్రెస్ తెరలేపిందని హరీశ్ రావు ఆరోపించారు.
పోలీసులకు వార్నింగ్
బీజేపీ అంటేనే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీకి 8 మంది ఎంపీలు గెలిచి ఏం లాభమని ప్రశ్నించారు. ‘ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చు. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుంది. సీఎం రేవంత్ కేరళ, కర్ణాటక, ఢిల్లీ తిరగడానికి సరిపోతుంది. రాష్ట్రంలో RR టాక్స్ నడుస్తుంది. పోలీసులు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్కులో రాసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతాం’ అని హరీశ్ రావు హెచ్చరించారు.
Also Read: Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!
‘స్థానిక ఎన్నికల్లో మాదే విజయం’
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ మాస్టర్ అంటూ హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కి నీళ్లు ఎలా తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ చెమట ఒడ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో లక్షా 20 ఎకరాల సాగు కోసం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును కేసీఆర్ తెచ్చారని హరీశ్ రావు అన్నారు. త్వరలో సంగమేశ్వర బసవెశ్వర ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో BRS గెలవడం పక్కా అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
