BC Reservations (IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Reservations: నేడు సుప్రీంలో రిజర్వేషన్లపై విచారణ.. 42 శాతంపై కొండంత ఆశ!

BC Reservations: బీసీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై (BC Reservations) కోర్టుల్లో ఏం తీర్పు వస్తుంది.. రాకరాకవచ్చిన 42శాతంపై ఏం జరుగుతుందనే చర్చజోరుగా సాగుతుంది. బీసీలకు రాజకీయంగా మంచిరోజులు వచ్చాయనుకున్న తరుణంలో రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లు అమలవుతాయా? జీవోను కోర్టులు అంగీకరిస్తాయా? ఏం సూచనలు ఇస్తాయనేది ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది.

 స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో ఇచ్చింది. స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. గ్రామాల వారీగా బీసీ రిజర్వేషన్లను సైతం ప్రకటించింది. వార్డు మెంబర్ మొదలు కొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ వరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 27శాతం, బీసీలకు 42శాతం మొత్తంగా రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. అందులో భాగంగానే ప్రత్యేక జీవో9ను సైతం జారీ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించడం చెల్లదంటూ సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

 Also Read: Kodanda Reddy: సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు

50శాతానికి మించరాదు

తెలంగాణలో 69శాతం వరకు రిజర్వేషన్లు చేరుకుంటున్నాయని ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులకు విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ 50శాతానికి మించరాదని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో స్పష్టం చేసిందని పిటిషన్ లో తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక రిజర్వేషన్లను 50 శాతం మించరాదన్న నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణ ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై జీవోను సమర్ధిస్తుందా?

అయితే  (ఈనెల6న) జస్టీస్ విక్రమ్ నాథ్, జస్టీస్ సందీప్ మోహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగనుంది. ఈ విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వెలువడనుందనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. రిజర్వేషన్లపై జీవోను సమర్ధిస్తుందా? లేక 50శాతం మించరాదన్న నిబంధనను కొనసాగించాలని ఆదేశిస్తుందా? ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచిస్తుందా? అసలు ఏంజరుగబోతుందనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా రిజర్వేషన్లపై హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్ ఈ నెల 8న (బుధవారం) విచారణకు రానుంది. రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు హైకోర్టుకు అనుమతిచ్చింది.

జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ

జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం స్థానిక ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ ను సైతం ప్రకటించింది. ఈ నెల 9న నోటిఫికేషన్ సైతం ప్రకటిస్తామని పేర్కొంది. ఈ తరుణంలో ఇటు సుప్రీంకోర్టులో, అటూ హైకోర్టులో రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. పోటీచేయాలనే ఆసక్తి ఉన్న ఆశావాహుల్లో సైతం లబ్ డబ్ మొదలైంది. తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఆ కోరిక నేరవేరుతుందనుకున్న సమయంలో కోర్టు ఏం తీర్పు వస్తుందనే ఆందోళన మొదలైంది. 42శాతం రిజర్వేషన్లు కొనసాగేలా తీర్పురావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

8న హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చ

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు( (BC Reservations))అమలుకోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు లో కేసు విచారణ, 8న హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎలాగైనా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా అడ్వకేట్లతో చర్చించాలని, అందుకు అవసరమైన అన్ని మార్గాలను అనుసరించాలని వ్యూహాలపై చర్చించారు. అదే విధంగా త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఓట్ చోరీ సంతకాల సేకరణ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందం

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం వెళ్లారు. రాత్రి సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యారు. న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచనలు సూచించారు. గతంలో రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేయాలని, జీవో 9ను కొనసాగించేలా చూడాలని న్యాయవాదులు వాదనలు వినిపించాలని కోరారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేలా ప్రభుత్వం పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచించారు.

రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం.. మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. కోర్టులో వేసిన పిటిషన్లను విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ , ఎస్టీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లకు నష్టం కలిగించేది కాదు అన్నారు. బలహీన వర్గాలకు చేయూతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆలోచన ప్రక్రియ లో రిజర్వేషన్లు ముందుకు తీసుకుపోతున్నామన్నారు.

కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అందరికీ సంబంధం అనే మాట కాదు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగే పరిస్థితుల్లో బలహీన వర్గాలకు పెద్దలంతా సపోర్ట్ గా ఉండాలన్నారు. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న హక్కు మాదిరి బీసీ లకు కూడా హక్కు ఉండాలని చేస్తున్న ప్రయత్నం అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తో ఏకాభిప్రాయంతో ఈ బిల్లు ముందుకు పోయిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు న్యాయ స్థానాల్లో రాజకీయ పార్టీల మద్దతే ప్రజల మద్దతు అని చెప్పాలన్నారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. 

 Also Read: Local Body Elections: హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. వీణవంక జెడ్పీటీసీ టికెట్ కోసం కోల్డ్ వార్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది