Warangal: తన గెలుపునకు పాటుపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన వరంగల్ ఎంపీ కడియం కావ్య.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని, తన తండ్రి పేరును నిలబెట్టే విధంగా పని చేస్తానని చెప్పారు. తనకు భారీ మెజార్టీతో విజయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలన్నారు. ఎంపీ ఎన్నికలతో అయిపోలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపు ఇచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎంపీగా గెలిచిన డాక్టర్ కడియం కావ్య పరిచయం, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు.
కడియం కావ్య గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. కడియం శ్రీహరికి గొప్ప పరిపాలనా అనుభవం ఉన్నదని, అవినీతిరహిత పాలన అందించే నాయకుడని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపు ఇచ్చారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం దక్కుతుందని, కార్యకర్తలు కాస్త ఓపిక పట్టాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా, అవినీతిరహితంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తన నియోజకవర్గంలో గ్రూపులు లేవని, ఎవరైనా గ్రూపులు అని తిరిగితే తోకలు కత్తిరించడం ఖాయం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పనిలో పోటీ పడుదామని, కూర్చునే సీటులో కాదని హితవు పలికారు. దేవాదుల ప్రాజెక్టుతో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగు నీరు అందించే బాధ్యత తనమీద ఉన్నదని వివరించారు. అభివృద్ధి, విద్య, వైద్యం, ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడం తన ఎజెండా అని, నియోజకవర్గ ప్రజలు తనను అర్థం చేసుకోవాలని కోరారు.