కోతులతో నిత్యం నరకం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల సమస్య మొదలైంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే పిల్లలు, మహిళలు, వృద్ధులు హడలిపోతున్నారు. చేతిలో ఆహార పదార్థాలను తీసుకెళ్లాలంటే జంకుతున్నారు. అంతేకాదు ఇళ్లల్లోని ఆహార పదార్థాలను సైతం కోతులు తీసుకెళ్లిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తిష్టవేసిన కోతుల కారణంగా గత కొంతకాలంగా తాము నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
గత కొన్నేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య తీరడంలేదని ఆగ్రహంతో ఉన్నారు. ఓట్లు వేసి సర్పంచులను, ఎంపీటీసీ లను గెలిపిస్తే ప్రధాన సమస్యగా మారిన కోతులను వెళ్లగొట్టడంలో వారు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. దీంతో సరైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చిన గ్రామస్తులకు స్థానిక ఎన్నికల రూపంలో మంచి అవకాశం లభించింది. అందుకే ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థులకు గ్రామంలోని కోతులను నివారించాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. ఓటు వేయాలంటే కోతులను వెళ్లగొట్టాల్సిందే అంటూ కరాఖండిగా తేల్చేస్తున్నారు.
Also Read: Unique Train Toilet: ఓరి దేవుడా ఇది కలా నిజమా.. రైలులో 5 స్టార్ బాత్రూమ్.. ఎంత బాగుందో!
గ్రామస్థులు ఏమంటున్నారంటే..
ఇంటి పరిసరాల్లో కూరగాయలు, పండ్ల చెట్లు పెంచినా కోతుల దాడితో ఏవీ దక్కట్లేదని మహిళా ఓటర్లు మండిపడుతున్నారు. కోతులను వెళ్లగొట్టే అభ్యర్థికే, స్వచ్ఛందంగా ఓటు వేస్తామంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై అవి ప్రధానంగా దాడి చేస్తున్నాయని.. దీంతో వారు ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కోతులను తొలగిస్తామని హమీ ఇచ్చిన అభ్యర్థులకే తమ ఓటు అంటున్నారు. ఓటుకు నోటు ఇవ్వకున్నా పర్లేదని.. ఊర్లల్లోని కోతులను వెళ్లగొడితే చాలని సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారు.
