Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
ధన్యవాదులు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం దంపతులు దసరా సంబరాలు
జమ్మి చెట్టుకు పూజలు చేసిన మంత్రి దంపతులు
మెదక్ బ్యూరో, స్వేచ్చ: బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని తెలిపిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని ప్రకటన ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విజయదశమి సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాన్వాయ్‌లోని వాహనాలకు వాహన పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీసమేతంగా జమ్మి చెట్టుకు శమీ పూజ చేసి, ఆయుధాలకు పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విజయదశమి పర్వదినాన అందరికీ మంచి విజయాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. చట్టపరమైన, న్యాయపరమైన అంశాలతో ముందుకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇచ్చామన్నారు. కొంతమంది కుహనా మేధావులు, బలహీన వర్గాల నాయకులనుకునేవారు సహకరించక పోతే మౌనంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చారిత్రాత్మక అంశం ఇంతకన్నా మంచిదంటే భారత ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం లీగల్‌గా చేయాల్సిన వన్నీ చేసిందని, న్యాయస్థానంలో గతంలో జడ్జిగా పని చేసిన వారు అవహేళనగా మాట్లాడుతున్నారని, ఆ పెద్దమనిషికి జ్ఞానం, అవగాహన ఉండాలని చురకలు అంటించారు. జస్టిస్ ఈశ్వరయ్య, రాజేందర్ ఏదో విధంగా మాట్లాడుతున్నారని, వారికి జ్ఞానం ఉంటే ఇంతకన్నా మంచి పద్ధతి చెప్పాలన్నారు.
Read Also- Planes collision: ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. విరిగిపోయిన ఓ విమానం రెక్క
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అని, న్యాయస్థానంలో పిటిషన్ వేసిన పిటిషనర్‌కి దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పిటిషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని, బలహీన వర్గాల రిజర్వేషన్లకు అన్ని పార్టీల మద్దతు ఉందంటూ న్యాయస్థానాలకు చెప్పే ప్రయత్నాలు చేసి, అఫిడవిట్లు సమర్పించాలన్నారు. ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే ఈ కార్యాచరణ తీసుకోవాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ కార్మికులకు సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, హుస్నాబాద్ పట్టణ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, హుస్నాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్లు సుద్దాల చంద్రయ్య, ఆకుల రజిత వెంకట్, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also