DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్ అని నూతన డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యేలా చూడటానికి సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. ఇక, పింక్, బ్లూ, రెడ్, వైట్ బుక్కులు ఉండవు…మాదంతా ఖాకీ బుక్కే అని అన్నారు. సమస్యే లేనపుడు మావోయిస్టులతో చర్చలు అనవసరమని వ్యాఖ్యానించారు. ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పోలీసు శాఖలో 17వేల ఖాళీలు ఉన్నాయని చెబుతూ వాటి భర్తీకి చర్యలు తీసుకుంటానన్నారు. ఏ లక్ష్యంతో ప్రభుత్వం తనకు ఈ బాధ్యతలు అప్పగించిందో…దాని కోసం పని చేస్తానన్నారు.
తక్షణ ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలే..
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఉదయం శివధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. దానికి ముందు ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ ముందున్న తక్షణ ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఎన్నికల ప్రక్రియను ముగించేలా చూడటానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. బేసిక్ పోలీసింగ్ కు సాంకేతికను జత చేసి సమర్థవంతమైన ఫలితాలను రాబడుతామని చెప్పారు. ప్రస్తుతం డిపార్ట్ మెంట్ లో 17వేల ఖాళీలు ఉన్నట్టు చెప్పిన ఆయన వాటిని భర్తీ చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!
చర్చలు అనవసరం…
సమస్యే లేనపుడు మావోయిస్టులతో చర్చలు అవసరమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తాము ఆయుధాలు వదిలి పెట్టి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీకి బసవరాజు జనరల్ సెక్రటరీగా ఉన్నపుడే ఈ నిర్ణయం జరిగిందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారని తెలిపారు. దీనిని జగన్ ఖండించినా ప్రజా పోరాట పంథా సక్సెస్ అవ్వలేదని మావోయిస్టులే అంటున్నారన్నారు. ఆయుధాలను వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చారని, తాజాగా సెంట్రల్ కమిటీ సభ్యరాలు సుజాతక్క కూడా లొంగిపోయారని చెప్పారు.
పోస్టులు పెడితే చర్యలు..
జనజీవన స్రవంతిలో కలిస్తే మావోయిస్టుల పునరావాసానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బేసిక్ పోలీసింగ్…విజువల్ పోలీసింగ్…ఎఫెక్టీవ్ మానిటరింగ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు ఉంటుందని చెప్పారు. అయితే, హక్కు ఉంది కదా అని ఎవరిపై పడితే వారిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, మాకుండేది ఒక్క ఖాకీ బుక్ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ, బీఎన్ఎస్ తదితర చట్టాలు కలిస్తే ఖాకీ బుక్ అవుతుందన్నారు. వాటిని పకడ్భంధీగా అమలు చేసి శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన విధి అని చెప్పారు. పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచటం కన్నా సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించటం ద్వారా ఫలితాలు సాధించ వచ్చని చెప్పారు. పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామన్నారు.
గవర్నర్ తో భేటీ…
డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత శివధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు.
Also Read: Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!