Schools: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్కూళ్లను మూసేసిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వాటిని తెరుస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గాంధీ భవన్‌లో మీడియాకు చెప్పారు. ఒక్క టీచర్ ఉన్నాసరే స్కూల్‌ను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. టీచర్లు లేరని గత ప్రభుత్వం స్కూల్స్ మూసేసిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే అట్టడుగు వర్గాల పిల్లలు విద్యకు దూరం అవుతారని చెప్పారు.
రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, ఈ ఆలోచనను స్వాగతిస్తున్నట్టు డాక్టర్ మల్లు రవి తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవని వివరించారు. కాబట్టి, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచవచ్చని, ఎక్కువ మంది విద్యార్థులను తిరిగి బడి బాట పట్టించవచ్చునని చెప్పారు. రూ. 2 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, మౌలిక వసతులు అన్నీ కల్పిస్తామని చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచుతామన్నారు. బడి బాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని గుర్తు చేశారు.
కాళేశ్వరానికి హోదా ఇచ్చి వృథా
పార్లమెంటులో బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాలపై కొట్లాడుతామని ఎంపీ మల్లురవి చెప్పారు. విభజన సమస్యలపైనా పరిష్కారం కోసం కేంద్రాన్ని నిలదీస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని గతంలో డివిజన్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు హోదా ఇవ్వమని అడగటంలో అర్థం ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి వృథా అవుతుందని, అందుకే తాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నామని వివరించారు.