Local Body Reservations: ప్రభుత్వం రాష్ట్రంలో పకడ్బందీగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ప్రకటించింది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభాల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు (Local Body Reservations) కేటాయించారు. డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో చేపట్టిన ఇంటింటిసర్వే ఆధారంగా చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే కొన్ని గ్రామాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉండి ఓసీలు గానీ, ఎస్సీ, ఎస్టీలు తక్కువ ఉన్నప్పటికీ రిజర్వేషన్లు కేటాయింపులు జరిగాయి. దీంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2018 పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ల కేటాయింపు జరుగడంతో కొన్ని గ్రామాల్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు మారాయి. ఇది చట్టప్రకారం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలు సైతం అవసరం లేదని తెలిపారు.
Also Read: Telangana Jagruthi: గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్.. ఈ సాకుతో జీవోను కోర్టు కొట్టివేసే ఆస్కారం!
31 స్థానాల్లో బీసీలకు
రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్(జడ్పీ)స్థానాలకు పంచాయతీరాజ్ శాఖ స్టేట్ యూనిట్ గా రిజర్వేషన్లు ప్రకటించింది. 31 స్థానాల్లో బీసీలకు 12, ఎస్సీ-6, ఎస్టీ-4, ఓసీ-9 స్థానాలు కేటాయించారు. జిల్లా యూనిట్ గా తీసుకొని జడ్పీటీసీ, ఎంసీసీ స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్ ప్రకటించారు. మండల యూనిట్ గా తీసుకొని ఎంపీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓ ప్రకటించారు. అదే విధంగా గ్రామయూనిట్ గా తీసుకొని వార్డు రిజర్వేషన్లను మండలంలోని ఎంపీడీఓ ప్రకటించారు. ఇది పంచాయతీరాజ్ యాక్టు ప్రకారమే నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఏదైనా అపోహలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని వారు అనుమానాలను నివృతి చేస్తారని వెల్లడించారు.
రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దానిని మార్చే అవకాశం లేదు
రిజర్వేషన్లు తప్పుగా ప్రకటించారనే అపోహలతో స్థానిక నేతలు ఎమ్మెల్యేల వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు కావాలని ఫలానా కులానికి ప్రకటించారు.. ఒత్తిడి తోనే రిజర్వేషన్ మార్చారు.. జనాభా ఎక్కువ ఉన్నవారిని వదిలి తక్కువ జనాభా ఉన్న కులానికి రిజర్వేషన్ ఇచ్చారని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతారని విశ్వసనీయ సమాచారం. ఒక్కసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దానిని మార్చే అవకాశం లేదని పంచాయతీరాజ్ చట్టం చెబుతుంది. చట్టం ప్రకారం 2018 తో రొటేషన్ చేయడంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు మారడం జరుగుతుంది. అంతే తప్ప కావాలని చేసే అవకాశం ఉండదని, పంచాయతీ రాజ్ ప్రకారమే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.