Election Code: రూ.50 వేలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్!
హనుమకొండ, స్వేచ్ఛ: తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు కొనసాగుతాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. షెడ్యూల్ వెలువడిన సోమవారం నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన ఈ పరిమితికి మంచి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు చూపించకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు.
Read Also- OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?
ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే.. ఎన్నికల అధికారులు ఐటీ (IT), జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సరైన పత్రాలు ఉంటేనే అనుమతి
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పత్రాలను చూపించగలిగితే.. జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.
అధికారులకు చూపించాల్సిన ఆధారాలు:
1. బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం రశీదు చూపించాలి.
2. వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు చూపెట్టాలి.
3. ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించవచ్చు.
4. వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి.
5. ఇతర అధికారిక చెల్లింపు రశీదులు ఏమైనా ఉంటే వాటిని కూడా చూపించే అవకాశం ఉంటుంది.
Read Also- Rural Health Care: పండుగకు తాళం వేసిన పల్లె దవాఖానలు.. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా..?