Future City:
హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి (Future City) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూర్ మండలంలో ఉన్న మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు, మీ పిల్లల భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. రాజకీయ పార్టీలు కుట్రలు, ఉసి గొల్పే చర్యలకు పాల్పడితే వారి మాటలను నమ్మకండి’’ అంటూ జనాలకు ఆయన పిలుపునిచ్చారు. భూములు కోల్పోయిన వారికి అన్యాయం చేయబోనని, అందరికీ న్యాయం చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు.
ఫార్చున్ 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన నగరాన్ని నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్ర ప్రజలలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విజయ దశమి అందరికీ విజయాలు చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. అయినప్పటికీ ఒక మంచి సంకల్పం కోసం ప్రకృతి సహకరించింది. వరుణ దేవుడు కరుణించాడు’’ అని సీఎం పేర్కొన్నారు.
Read Also- Transgenders: ట్రాన్స్ జెండర్స్ చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా?.. దాని వెనుకున్న రహస్యం ఇదే!
కుట్రలు చేస్తున్నారు
ఫ్యూచర్ సిటీపై చాలా మంది కుట్రలు చేస్తున్నారని, అనేక ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయని చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ మా కోసం కాదు.. భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల, పిల్లల తరాల కోసం ఆలోచిస్తున్నాం. కూలీకుతుబ్ షా, నిజాం రాజులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను అభివృద్ధి చేశారు. నేడు హైదరాబాద్ ,సికింద్రాబాద్‌లు జంట నగరాలుగా అభివృద్ధి చెందాయి. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారు. ఐటీ రంగంలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలి
గతం నుంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలో లండన్, దుబాయ్, సింగపూర్ నగరాల గురించి గొప్పలు చెప్పడం కాదని, అలాంటి నగరాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించామని ఆయన పేర్కొన్నారు. ‘‘నాకు పదేళ్లు ఇవ్వండి. న్యూయర్క్‌లో ఉండే వాళ్లు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా. ఇంత పెద్ద అభివృద్ధిలో కొంత మందికి ఇబ్బందులు కలగవచ్చు. కానీ, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించాం. మన ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్‌కు 12 లైన్ల గ్రీన్ రేడియల్ రోడ్డు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు, అమరావతికి, చెన్నైకి బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ప్రపంచంలో ఫార్చున్ 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీలో ఉండే విధంగా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రజలు సహకరించండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. కోర్టులు ఎందుకు?, నేనే మీకు అండగా ఉంటాను. మీ సమస్యలను నేను పరిష్కరిస్తాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
వారి మాటలు నమ్మకండి.
రాజకీయ పార్టీలు ఉసిగొల్పుతాయని, కానీ, వారి మాటలు నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘కోర్టుతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించుకుందాం. మీ కష్టం, మీ ఆస్తులు నేను తీసుకోవడం కాదు. అందుకు, మీకు న్యాయం చేసి తీసుకొని ముందుకెళ్తాం. డిసెంబర్ నెలలో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం. నెలకు మూడుసార్లు నేను ఫ్యూచర్ సిటీలోనే ఉంటానుఫ్యూచర్ సిటీలో . సింగరేణికి 10 ఎకరాలు కేటాయించండి. రేపటిలోగా సింగరేణి కార్పొరేట్ గ్లోబల్ కార్యాలయం కోసం భూమిని కేటాయించండి. ఫ్యూచర్ సిటీలోనే మన భవిష్యత్ తరాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి’’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.