Telangana High Court: చట్టప్రకారమే బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకెళ్లాలని హైకోర్టు (Telangana High Court) ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో జారీ చేయటం సరైన చర్య కాదని వ్యాఖ్యానించింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకోండని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చనెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మెరిట్ పద్దతిలో మధ్యంతర విచారణ జరుపుతామని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించటం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం సాయంత్రం విచారణ జరిపింది.
Also Read: CM Revanth Reddy: విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్.. ఏటీసీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
50శాతం రిజర్వేషన్లు దాటకూడదు
ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 42 శాతానికి పెంచారని న్యాయస్థానానికి తెలిపారు. దీని వల్ల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60శాతం దాటి పోయిందని చెప్పారు. 50శాతం రిజర్వేషన్లు దాటకూడదన్న రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధమని తెలిపారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం కూడా రిజర్వేషన్లు 50శాతం మాత్రమే ఉండాలన్నారు. కొత్తగా జారీ చేసిన జీవోతో ఇది 67శాతానికి చేరుతుందని వివరించారు. 2018లో బీసీ రిజర్వేషన్లను 35శాతం పెంచుతూ ఇచ్చిన జీవోను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టి వేసిందని తెలిపారు. పంచాయితీ రాజ్ చట్టంలోని 258ఏ సెక్షన్ ను సవరిస్తూ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుతం ఇది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం పెండింగ్ లో ఉన్న అంశంపై జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది.
బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్ చేశారా?
దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ గవర్నర్ వద్ద పెండింగ్ ఉంటే జీవో జారీ చేయవచ్చన్నారు. దాంతో గతంలో ఇలా జీవోలు జారీ చేయవచ్చని తీర్పులు ఉంటే చూపించాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఇక, అసెంబ్లీలో చేసిన తీర్మానానికి, విడుదలైన జీవోకు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం వచ్చనెల 6వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా? అని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్ చేశారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదులను అడిగింది. దీనిపై స్పష్టమైన సమాధానం రాకపోవటంతో గెజిట్ చేయక ముందే హైకోర్టుకు ఎందుకు వచ్చారు? అని అడిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం వచ్చే నెల 8వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read: DGP Shivadher Reddy: మహిళల భద్రతకు పటిష్ట చర్యలు.. నూతన డీజీపీ కీలక వాఖ్యలు