R Narayana Murthy: రీసెంట్‌గా ఏపీ అసెంబ్లీలో శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓ లేఖను విడుదల చేస్తూ.. బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రోజు చిరంజీవితో పాటు జగన్‌ను కలవడానికి వెళ్లిన పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వివాదంపై ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) మాట్లాడుతూ..
ఆ బాధ్యత నాపై ఉంది
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విధానం ఏదయితే ఉందో అది సత్యం. అది నూటికి నూరుపాళ్లు సత్యం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు, పేర్ని నాని (Perni Nani) సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకడిని. చిరంజీవి మాట్లాడుతూ.. ఆర్. నారాయణ మూర్తి కూడా వచ్చారని అన్నారు. అందుకే ఆ రోజు ఏం జరిగిందని నన్ను మీడియా అడుగుతుంది. ఆ రోజు జరిగిన విషయం గురించి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి చెబుతున్నాను. సత్యం చెబుతున్నాను.
Also Read- YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్
అది చిరంజీవి సంస్కారం
జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గవర్నమెంట్, మా సినిమా కళాకారులనుగానీ, చిరంజీవినిగానీ.. ఎవరినీ అవమానించలేదు. చాలా గౌరవించారు.. ఇది సత్యం. ఎందుకంటే, కోవిడ్ కష్టకాలంలో, సినిమా రంగం ఏమైపోతుంది? అని భయాందోళనలో ఉన్న దశలో.. పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవిని కలిశారు. ఆయనని పరిశ్రమ పెద్దగా భావించి, గౌరవించి.. అందరూ ఆయనని వాళ్లింట్లో కలిశారు. చిరంజీవి నాకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. అది ఆయన సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను.
చిరంజీవికి సెల్యూట్
ఆయన ఫోన్ చేసి.. ‘నారాయణ మూర్తి.. ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు చిత్రాలు తీసే మీలాంటి వారందరూ కూడా రావాలి. మీ అభిప్రాయాలు కూడా చెప్పాలి. మనందరం కూడా ప్రభుత్వాన్ని కలవాలి. ప్రభుత్వం నుంచి మనకు ఏ సహాయ సహకారాలు వస్తాయో.. మనం స్వీకరించాలి. మనం వారికి విన్నవించాలి’ అని చిరంజీవి చెప్పడం జరిగింది. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశంలో అందరూ వారి అభిప్రాయాలు చెప్పారు. ఆయనని తీసుకుని వెళ్లి సీఎంను కలుద్దామని అన్నారు. ఆయన స్వయంగా సీఎంతో మాట్లాడారు. నేను కూడా పేర్ని నానికి విజ్ఞప్తి చేశాను. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి తీసుకున్న రోల్‌కు మనస్ఫూర్తిగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నాను. పరిశ్రమ పెద్దగా ఆ రోజు ఆయన చాలా గొప్ప పాత్రని పోషించారు. ఆయనని ఎవరూ అవమానించలేదు.. చాలా గౌరవించారు.
Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!
ఇప్పటి ప్రభుత్వమైనా సమస్యలు క్లియర్ చేయాలి
మేమందరం వెళ్లాం. సమస్యను చెప్పాం. సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించారు. పేర్ని నానితో మాట్లాడి.. మీకు ఏం కావాలో అది చేయించుకోండి. ఏం కావాలో అన్నీ చేద్దామని చెప్పారు. ఇదే జరిగింది. ఇది సత్యం. ఇంకా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆయన ప్రభుత్వం ప్రస్తుతం లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో.. అవన్నీ చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని, అందుకు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ సహకరించాలని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి, ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. మా పరిశ్రమ సమస్యలను క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడను
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. నేను బాలకృష్ణ గురించి, ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడదల్చుకోలేదు. అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటిది సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడని.. ఆర్ నారాయణ మూర్తి అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు