– ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్ష
– బీఆర్ఎస్ హయాంలో రెండు సార్లు రద్దు
– కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి
– ఒక్క నిమిషం నిబంధనతో పలువురు అభ్యర్థులు వెనక్కి
– గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై ప్రశ్నలు
– జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళన
Group 1 Exam: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఒక్క నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు చాలా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. 10 గంటలకు గేట్లను మూసివేశారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను ఎవరినీ లోనికి అనుమతించలేదు.
ఆలస్యం.. విషం
ఆదిలాబాద్ జిల్లా మావలలో నలుగురు మహిళా అభ్యర్థుల ఆధార్ కార్డుల్లో డాటర్ ఆఫ్‌కు బదులు వైఫ్ ఆఫ్ ఉన్నదని వెనక్కి పంపించారు. పెళ్లికాకముందు దరఖాస్తు చేసినందున అప్పుడు డాటర్ ఆఫ్ ఉన్నదని, పెళ్లయ్యాక ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ ఉంటుంది కదా అని ప్రశ్నించడంతో అడ్రస్ ప్రూఫ్ చూపించాలని నిర్వాహకులు కోరారు. దీంతో అడ్రస్ ప్రూఫ్ కోసం పరుగులు పెట్టి తీసుకువచ్చేసరికి ఆలస్యమైంది. అధికారులు లోనికి అనుమతించకపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. సిద్ధిపేట డిగ్రీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కరీంనగర్‌లోని విమెన్స్ డిగ్రీ కాలేజీ సెంటర్‌కు లేట్‌గా వచ్చాడని యువకుడిని, గోదావరిఖనిలో బాలికల జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిందని కావేరి అనే యువతిని వెనక్కి పంపించారు. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది వరకే రెండు సార్లు వాయిదా పడి ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనందున అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.
అరగంట ఉన్నా ఐదు నిమిషాలేనని!
జగిత్యాల పట్టణంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. పరీక్ష పూర్తి కావడానికి అరగంట టైం ఉన్నా ఇన్విజిలేటర్ కేవలం ఐదు నిమిషాలే టైం ఉన్నదని చెప్పారని, దీంతో సమయం నిజంగానే అయిపోయిందేమోనని తాము కంగారుగా సమాధానాలు పెట్టేశామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
పథకాలపై ప్రశ్నలు
ప్రిలిమ్స్ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించిన ప్రశ్నలు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల గురించి ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలను సోషల్ మీడియాలో అభ్యర్థులు పంచుకున్నారు.
కాంగ్రెస్ హయాంలో పరీక్ష
2022 ఏప్రిల్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. కానీ, ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షను కమిషన్ రద్దు చేసింది. అనంతరం, జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా, నిర్వహణలో లోపాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్‌ను ప్రక్షాళన చేసింది. అలాగే, కొత్తగా మరో 60 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. దీంతో మొత్తంగా 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తాజాగా ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను టీజీపీఎస్సీ ప్రశాంతంగా జరిపింది. ప్రశ్న పత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది టీజీపీఎస్సీ.
