New DGP:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా (New DGP) శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. శివధర్ రెడ్డి కొత్త డీజీపీగా రానున్నారని ఈ నెల 8న ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనం ఇచ్చింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న డాక్టర్ జితేందర్ ఈనెల 30న రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టును దక్కించుకునేందుకు కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు తీవ్రంగా పోటీ పడ్డారు. రేసులో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్‌గా పని చేస్తున్న సీవీ.ఆనంద్ అగ్రస్థానంలో నిలిచారు.
చివరకు 1994వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డినే డీజీపీ పోస్ట్ వరించింది. ఆయనకు 2026, ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. అయితే, ఆ తరువాత మరికొంత కాలంపాటు ఆయన సర్వీస్ ను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐపీఎస్ సాధించిన శివధర్ రెడ్డి కెరియర్ మొదట్లో అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన గ్రేహౌండ్స్ విభాగంతోపాటు బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేశారు. ఇక, ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు.
Read Also- NRI Strugule: అమెరికాలో 11 ఏళ్ల అనుభవం.. ఎంత ట్రై చేసినా ఇండియాలో జాబ్ దొరకడం లేదంటూ ఆవేదన
హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. దాంతోపాటు అత్యంత సున్నితమైందిగా పరిగణించే దక్షిణ మండలం డీసీపీగా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఎస్పీగా పని చేసిన శివధర్ రెడ్డి యూనైటెడ్ నేషన్స్ మిషన్ లో భాగంగా కొసోవాలో కూడా విధులు నిర్వర్తించారు. డీఐజీగా ప్రమోషన్ పొందిన తరువాత 2008–2012 మధ్య ఎస్ఐబీ ఛీఫ్ గా, ఆ తరువాత ఏసీబీ అదనపు డైరెక్టర్ గా తనదైన శైలిలో పని చేసి ప్రశంసలు పొందారు. ఐజీగా ప్రమోట్ అయిన తరువాత ఏసీబీకి డైరెకక్టర్ కూడా విధులు నిర్వర్తించారు. అనంతరం 2012–14 మధ్య విశాఖపట్టణం కమిషనర్ గా ఉన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా నియమితులైన శివధర్ రెడ్డి అదనపు డీజీగా పదోన్నతి పొందిన తరువాత పర్సనల్ విభాగం, రైల్వే, రోడ్డు సేఫ్టీ అథారిటీల్లో పని చేశారు. 2023లో తిరిగి ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా నియమితులయ్యారు. 2024, ఆగస్టులో డీజీపీగా ప్రమోషన్ వచ్చిన తరువాత అక్కడే కొనసాగుతూ వస్తున్నారు. 2014లో శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నపుడే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరగటం గమనార్హం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చిన ఆయన ఇప్పటివరకు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఆంత్రిక్ సురక్షా సేవా మెడల్, యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, అతి ఉత్క్రుష్ట్ సేవా పతకం, అసాధరణ్ ఆసూచన కుశల్తా పథకంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నుంచి ప్రశంతా పత్రాన్ని సాధించారు.