Rain Updates: వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం సాయంత్రం నుంచి రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rain Updates) కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో, జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరదనీరు భారీగా పోటెత్తుతోంది. నిండుకుండలను తలపిస్తున్న ఈ జలాశయాలను నుంచి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లు పైకెత్తారు. ఫలితంగా మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో, మూసీ నది పరిసరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా నార్సింగి-హిమాయత్‌సాగర్ సర్వీస్ రహదారిని అధికారులు బంద్ చేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా మంచిరేవుల – నార్సింగ్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఆ రోడ్డు వెంబడి ప్రయాణాలు చేసేవారు అప్రమత్తమై ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.
దిగువకు నీరు విడుదల
భారీ వర్షాలు, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. కాగా, ఈ జలాశయానికి ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులుగా ఉందని, ఇదే సమయంలో ఔట్ ఫ్లో 4,100 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఇక, ఉస్మాన్ సాగర్ జలాశయం పది గేట్లెను అధికారులు పైకెత్తారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 4,500 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 7,096 క్యూసెక్కులుగా ఉందని వివరించారు.