– చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
– మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
– పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
– హైదరాబాద్‌లో భారీ వర్షాలు
Weather Update: నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింత విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణతోపాటు కోస్తాంధ్ర, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది.
సోమవారం ఉదయం నుంచే వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నది. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 11, 12వ తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. 13వ తేదీ ఉదయం వరకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. కానీ, వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
రాజధాని హైదరాబాద్‌లోనూ ఈ అలర్ట్ ఉన్నది. ఉదయం పూట ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.