Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం గోల్డెన్ కేర్
రాచకొండలో వినూత్న కార్యక్రమం
అన్ని విధాలుగా అండగా ఉంటాం: సీపీ సుధీర్ బాబు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘గోల్డెన్ కేర్ (Golden Care)… మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ పేరిట రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్లకు చట్టపరంగా అవసరమైన అన్ని సేవలను అందిస్తామని చెప్పారు. బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 144 ప్రకారం, వృద్ధులైన తల్లిదండ్రుల ఆలనాపాలనా పట్టించుకోక పోయినా, వారికి భోజనం పెట్టక పోయినా, వారిని వేదనకు గురి చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గోల్డెన్ కేర్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 47 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్టు చెప్పారు. సీనియర్ సిటిజన్ల వద్దకు ఆయా స్టేషన్ల సీఐ, ఎస్ఐలతో పాటు జోన్ డీసీపీలు, ఏసీపీలు వారికి అనుకూలమైన సమయంలో వెళ్లి పలకరించి యోగక్షేమాలు తెలుసుకుంటారన్నారు.
Read Also- Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అలర్ట్ అయిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ
అవసరమైన సేవలు
ఉద్యోగరీత్యా ఎవరి పిల్లలైనా ఇతర ప్రాంతాల్లో ఉన్నా, లేదా ఇక్కడే ఉండి సరిగ్గా చూసుకోని వృద్ధులకు అవసరమైన సేవలను పోలీసులు అందిస్తారన్నారు. ఇటీవలి సైబర్ క్రిమినల్స్ వృద్దులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. వైద్య, ఇతర అత్యవసర సహాయం కోసం ఆస్పత్రులతో ఎస్‌వోఎస్ సెటప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తామన్నారు. కన్నవారిని నిర్లక్ష్యం చేసే పిల్లల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. దీనికి సంబంధించి చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్లు ఉన్నట్టు తెలిపారు. తమకెలాంటి సమస్య ఎదురైనా…ఎవరైనా సీనియర్ సిటిజన్లు సమస్యల్లో ఉన్నారని తెలిసినా 14567 అన్న హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చన్నారు. దాంతో పాటు 8712662111 నెంబర్‌కు వాట్సప్ కూడా చేయవచ్చని సూచించారు. రాచకొండ పోలీసులు ఎప్పుడూ సీనియర్ సిటిజన్ల కుటుంబ సభ్యుల్లా ఉంటారని చెప్పారు.
పాల్గొన్న అతిథులు
కార్యక్రమానికి వచ్చిన పలువురు సీనియర్ సిటిజన్స్ కు కిట్స్ ను అందచేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎల్డీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, భువనగిరి డీసీపీ ఆకాం క్క్ష యాదవ్, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ బాబు, డీసీపీలు ఇందిర, ఉషారాణి, నాగలక్ష్మి, రమణారెడ్డి, మనోహర్ తోపాటు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు శివ, సావిత్రి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.