Operation Numkhor: భూటాన్ నుంచి భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా తీసుకొచ్చిన లగ్జరీ కార్లపై కొచ్చి కస్టమ్స్ కమిషనరేట్ మంగళవారం కేరళలో ఒకేసారి దాడులు నిర్వహించి 36 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వాహనాలు కస్టమ్స్ సుంకం తప్పించుకుని, నకిలీ పత్రాలతో నమోదు చేయబడ్డాయని గుర్తించారు. ప్రముఖ మలయాళ నటులు కూడా ఈ దర్యాప్తులో ఉన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ పేరిట రెండు వాహనాలు, నటుడు అమిత్ చక్కలక్కల్ (Amit Chakkalakkal) పేరిట ఆరు వాహనాలు స్వాధీనం చేయబడ్డాయని అధికారులు ధృవీకరించారు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేరిట ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్, టొయోటా ప్రాడో వాహనాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఆయనకు చెందిన మరో వాహనం, చక్కలక్కల్‌కు చెందిన మరో రెండు వాహనాలు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు నటుడు పృథ్వీరాజ్ నివాసంలోనూ తనిఖీలు చేసినప్పటికీ, అతని వాహనాలేవీ స్వాధీనం చేయబడలేదు. ఇతర స్వాధీనం చేయబడిన వాహనాలు పలువురు పేరున్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సీనియర్ అధికారుల పేరిట నమోదైనట్లుగా తెలుస్తోంది. కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టిప్పురం, త్రిస్సూర్‌లలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం ఒక్క కేరళలో మాత్రమే 150-200 ఇలాంటి వాహనాలు నడుస్తున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ మిగిలిన వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారుల తెలిపారు. సెలబ్రిటీలతో సహా వాహన యజమానులకు కార్లు కొనుగోలు చేసేటప్పుడు స్మగ్లింగ్ రాకెట్ గురించి తెలుసా? అనే కోణంలో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘వారందరికీ సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తాం. ఒకవేళ వారు చట్టబద్ధమైన కొనుగోలును నిరూపించే సరైన పత్రాలను చూపించలేకపోతే, అరెస్టు సహా కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఒక అధికారి తెలిపారు. చక్కలక్కల్ మంగళవారం కస్టమ్స్ ముందు హాజరై, వివరాలు చెప్పినప్పటికీ మళ్లీ ఆయనకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read- Reba Monica John: ‘కూలీ’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నెటిజన్లు ఫైర్!
ఆపరేషన్ నమ్‌ఖోర్
కొచ్చి కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనర్ టి. తిజు చెబుతున్న వివరాల ప్రకారం.. భూటాన్ జోంగ్ఖా భాషలో ‘వాహనం’ అని అర్థం వచ్చే ‘నమ్‌ఖోర్’ (Operation Numkhor) అనే కోడ్‌నేమ్‌తో ఈ సమన్వయ ఆపరేషన్‌ను.. 30కి పైగా ప్రాంతాల్లో కేరళ రవాణా కమిషనరేట్, యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS), ఇంకా రాష్ట్ర పోలీసుల సహకారంతో నిర్వహించారు. ‘‘భారతదేశంలో సెకండ్-హ్యాండ్ వాహనాల దిగుమతి నిషిద్ధం, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రెసిడెన్స్ (TR) సౌకర్యంతో నిర్దేశిత పోర్టుల ద్వారానూ, దాదాపు 160 శాతం సుంకం చెల్లించడం ద్వారా మాత్రమే దిగుమతికి అనుమతి ఉంది’’ అని తిజు వివరించారు. ‘‘మాకు అందిన సమాచారం ప్రకారం, ఈ కార్లు.. కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) విధానంలో, కార్గో కంటైనర్లలో దాచి, లేదా టూరిస్ట్ వాహనాలుగా మార్చి, డ్రైవ్ ద్వారా భారతదేశంలోకి స్మగ్లింగ్ చేయబడ్డాయి. ఇలాంటి కార్లు గతంలో బంగారం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు కూడా ఉపయోగించబడినట్లు అనేక నివేదికలు సూచిస్తున్నాయి’’ అని తెలిపారు.
Also Read- OTT Movie: ఎవరూలేని టీనేజ్ అమ్మాయి జీవితంలో జరిగిన షాకింగ్ ఘటన ఏంటంటే?
జాతీయ భద్రతకు ముప్పు
ఈ రాకెట్‌ను ‘తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పు’ అని పిలిచిన తిజు, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న కార్లు నకిలీ పత్రాలతో బహుళ రాష్ట్రాల్లో నమోదు చేయబడినట్లుగా తెలిపారు. స్మగ్లర్లు భారత సైన్యం, అలాగే భారత, విదేశీ రాయబార కార్యాలయాలకు చెందినట్లు నకిలీ స్టాంప్స్, పత్రాలను ఉపయోగించి వాహనాలను నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 36 కార్లలో ప్రతి ఒక్కటి రోడ్ రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) నిబంధనలను ఉల్లంఘించి ఉన్నాయి. భూటాన్‌లో తక్కువ దిగుమతి సుంకాలతో, భారతదేశంతో ఉన్న అటవీ సరిహద్దుల సడలింపును ఈ సిండికేట్ దుర్వినియోగం చేసి వాహనాలను తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. భూటాన్‌లో కొన్ని లక్షలకు కొనుగోలు చేసిన కార్లను.. భారతదేశంలోకి స్మగ్లింగ్ చేసి, వారు కొనుగోలు చేసిన ధర కంటే ఐదు నుంచి పది రెట్ల పెంచి అమ్ముతున్నారు. ఈ రాకెట్ MORTH యొక్క పరివాహన్ పోర్టల్‌ను కూడా మోసం చేసి నకిలీ యాజమానులతో రికార్డులను సృష్టించింది. ఇది హ్యాకింగ్ ద్వారా లేదా MORTHలో లోపలి వ్యక్తుల సహాయంతో జరిగి ఉండవచ్చు’’ అని తిజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ చట్టవిరుద్ధ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ ఆదాయం ఉగ్రవాద నిధులకు మళ్లించబడి ఉండవచ్చా? అని అడగగా.. ‘‘దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను విభాగం, GST ఇంటెలిజెన్స్ వంటి ఇతర సంస్థలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు’’ అని తెలిపారు.
విస్తృత రాకెట్ బయటపడింది
కస్టమ్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, కోయంబత్తూరు నుంచి నడుస్తున్న ఒక సిండికేట్ రాకెట్ ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి భారతీయ, విదేశీ కరెన్సీని భూటాన్‌కు స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ‘‘ఈ నెట్‌వర్క్‌ను గుర్తించాము. దర్యాప్తు సాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు బయటవస్తాయి’’ అని ఒక అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న చాలా కార్లు ఇప్పటికీ కేరళలో విక్రయించబడలేదు. అయినప్పటికీ వాటిలో చాలా వాహనాలు నెలల క్రితం కొనుగోలు చేయబడ్డాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు