Fake Surveys: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్థానిక సంస్థల ఎలక్షన్లు సమీపించిన నేపథ్యంలో కాసుల సంపాదనకు ఇదే అవకాశమని సెఫాలజిస్టులు(Cephalologists)గా చెప్పుకొంటున్న పలువురు రంగంలోకి దిగారు. ఆయా పార్టీల్లోని కీలక నేతలను కలుస్తూ సర్వే చేసి పెడతాం.. ఫీజుగా మాకింత ఇస్తే చాలని బేరాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే అప్పుడే సర్వేలు పూర్తి చేశామని చెబుతూ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇలాంటి వారిని నమ్మ వద్దంటూ ఆయా రాజకీయ పక్షాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్(Congress) పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) మీడియాతో మాట్లాడుతూ సెఫాలజిస్టులమని చెప్పుకొంటూ తమ పార్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. వీరిని నమ్మవద్దని సూచించారు.
మంచి తరుణం మించిన దొరకదు
ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఆయా పార్టీలు జనం నాడి ఎలా ఉందన్న దానిని తెలుసుకునేందుకు సర్వేలు చేయించే విషయం అందరికీ తెలిసిందే. దీని కోసం అనుభవజ్ఞులైన సెఫాలజిస్టుల సేవలను ఆయా రాజకీయ పక్షాలు వినియోగించుకుంటాయి. వీళ్లు ఇచ్చే నివేదికలను ఆధారంగా చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించటానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటుంటాయి. అయితే, ఎలక్షన్లు రాగానే కొందరు మంచి తరుణం మించిన దొరకదు అనుకుంటూ సెఫాలజిస్టులుగా తెరపైకి వస్తున్నారు. ఫలానా ఎన్నికల్లో మేం చేసిన సర్వే వందకు తొంభై శాతం నిజమైందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. ఆయా పార్టీల నేతలు, ఆశావహులను కలుస్తూ సర్వే చేసి పెడతాం.. ఫలితాలు ఎలా ఉంటాయో తేల్చి చెబుతామంటూ దీని కోసం ఫీజుగా కొంత చెల్లించండి అంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు.
Also Read: Uttar Pradesh: ఎస్పీ తల్లికి అనారోగ్యం.. డాక్టర్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు.. యూపీలో రచ్చ రచ్చ!
వీరిలో ఎవ్వరినీ నమ్మ వద్దు..
సైదులు అనే వ్యక్తి ఇలాగే కాంగ్రెస్ తరపున సర్వేలు చేస్తున్నట్టు మీడియాలో సైతం ప్రచారం చేస్తున్నాడు. అయితే, అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పెయిడ్ ఆర్టిస్ట్ అయిన సైదులుతో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. ఒక్క సైదులే కాదు.. పదుల సంఖ్యలో ఇలా సర్వేయర్లు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎవ్వరినీ నమ్మ వద్దని ఆయా పార్టీల అగ్రనేతలు శ్రేణులకు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ చేసి ప్రచారం చేస్తామని వచ్చే వారిని కూడా దూరం పెట్టాలని చెబుతున్నారు. వీళ్లు డబ్బు కోసం ఆశావహులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీరిని నమ్మితే ఇల్లు గుల్లవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇక, ఇలాంటి వాళ్లు సర్వేల పేర చేసే ప్రచారాన్ని నమ్మవద్దని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. అభ్యర్థుల అర్హతలు. .ఆయా పార్టీలు పని చేస్తున్న తీరును విశ్లేషించుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతున్నారు.
Also Read: Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు