Fish medicine Hyderabad distribution started by Minister Ponnam:
మృగశిర కార్తె పురస్కరించుకుని ప్రతి ఏటా బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ నిరాటంకంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతోంది. శనివారం ఉదయం 11 గంటలనుంచి ప్రారంభమయింది. 36 గంటల పాటు ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగే చేప ప్రసాద పంపిణీకి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహర్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు ఇప్పటికే చేరుకున్నారు. ఫిష్ మెడిసిన్ తీసుకునేందుకు గాను ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానం ఆస్తమా వ్యాధిగ్రస్తులతో నిండిపోయింది. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదాన్ని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్‌నాథ్ గౌడ్, సోదరుడు గౌరీ శంకర్‌లు పంపిణీతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్,ఫిషర్మర్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నేతలు. పాల్గొన్నారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్ కి బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
15 సంస్థల ఆధ్వర్యంలో ఉచిత భోజనం
ఫిష్ మెడిసిన్ కొసం వచ్చే ఆస్తమా బాధితులు, వారి సహాయకులతో ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిండిపోగా వారికి 15 స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. పోలీసుశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో చేప ప్రసాదం కోసం బాధితులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఘటనలు జరిగినా ఎదుర్కొవడానికి చర్యలు చేపట్టింది.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
చేప ప్రసాదం కోసం ప్రజలు రైళ్లు, బస్సుల్లో నగరానికి వస్తుండడంతో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శనివారం నుంచి ఫిష్ మెడిసిన్ పంపిణీ ముగిసేంత వరకు 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ కూడా 6 వైద్య బృందాలను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. శుక్రవారం సెంట్రల్ జోన్ డీసీపీ అవినాష్, అదనపు సీపీ విక్రమ్ జెట్మన్, తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎగ్జిబిషన్ మైదానం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.