Harish Rao: మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే… తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ.35,000వేల కోట్లా అని మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరిస్తారట అని అన్నారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 టీఎంసీలు మాత్రమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట.. 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం.. అమోఘం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం అని మండిపడ్డారు. ఇది కదా అసలైన మార్పంటే అని దుయ్యబట్టారు.
పండుగలు వస్తే దండుకోవడమేనా?
పండుగలు వస్తే చాలు..దండుకోవడమేనా? అని ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. 50% ఆర్టీసీ(RTC) టికెట్ ఛార్జీల పెంపు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటు అన్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అన్నారు.
Also Read: Engineering Fee Hike: బిగ్ న్యూస్.. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు?
ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే
అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతున్నదని, పండుగ సంబురం లేకుండా చేస్తున్నదన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అన్నారు. కాంగ్రెస్ తన 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను బలంగా చేస్తే, కాంగ్రెస్ కుప్ప కూల్చిందని దుయ్యబట్టారు.
Also Read: Kadiyam Srihari: కడియం రాజీనామాపై పోస్టర్లు.. రఘునాథపల్లిలో రాజుకుంటున్న రాజకీయ చిచ్చు