Mrugasira Karthi Today Telangana People Are Going Up To Buy Fish: మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్తె వచ్చిందంటే చాలు చేపల కోసం జనాలు ఎగబడి కొంటుంటారు.ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రజల విశ్వాసం. దీంతో మార్కెట్లోని అన్నిరకాల చేపలకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చెరువుల వద్ద గ్రామస్థులు చేపలు కొనేందుకు క్యూ కట్టారు. అదే విధంగా పట్టణాల్లోని చేపల మార్కెట్లు అన్ని జనాలతో కిటకిటలాడుతున్నాయి.
ఇక హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లతో పాటు ముషీరాబాద్, రాంనగర్ చేపల మార్కెట్లలో మృగశిరకార్తె సందర్భంగా పలు ప్రాంతాల నుంచి చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. మామూలు రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగతుండగా మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్మకం అవుతాయని వ్యాపారులు తెలిపారు. బొచ్చ, రవ్వ కిలో రూ.100 నుంచి 120కి విక్రయిస్తున్నారు. ఇక చిన్న సైజు చేపలు కిలో రూ.వంద చొప్పున విక్రయిస్తున్నారు.
ఇక తెలంగాణలోని ఆయా జిల్లాల గ్రామాలు, మండలాల చెరువులు, కుంటలు జనాలతో కిటకిటలాడుతోంది. ఆయా గ్రామాల్లోని చెరువుల వద్ద ఇప్పటికే జనాలు కుంటలోకి దిగి చేపలను పట్టుకుంటున్నారు. అంతేకాకుండా చేపలను కొనేందుకు ఎగబడుతున్నారు. దీంతో మత్స్యాకారులకు పంట పండిందనే చెప్పాలి. మామూలు ధరల కంటే ఈరోజు చేపల ధరలను అమాంతం పెంచేసి ప్రజల అవసరాలను క్యాచ్ చేసుకుంటున్నారు.