– ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు
– ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి
– చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు కిరణ్
– పాడె మోసిన చంద్రబాబు, తదితరులు
funeral function of completed at Ramoji rao ed at Film city: అక్షర యోధుడు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సువిశాల ప్రాంతంలో ప్రత్యేకంగా రామోజీరావు నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే కార్యక్రమం జరిగింది. రామోజీరావు చితికి పెద్ద కుమారుడు కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానులు ‘జోహార్ రామోజీరావు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
పాడె మోసిన చంద్రబాబు
అంత్యక్రియలకు ముందు రామోజీరావు అంతిమయాత్ర జరిగింది. ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర, రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు చంద్రబాబు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళులు
అంత్యక్రియల్లో నారా లోకేశ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. రామోజీ సేవలను గుర్తు చేసుకున్నారు.