teenmar mallanna going in a winning way in mlc bypoll | Teenmar Mallanna: విజయం దిశగా మల్లన్న
Teenmar Mallanna
Political News

Teenmar Mallanna: విజయం దిశగా మల్లన్న

– మూడవ రౌండ్ ముగిసే నాటికి 18,878 ఓట్ల ఆధిక్యం
– కొనసాగుతున్న నాలుగో రౌండ్‌ కౌంటింగ్
– కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ
– ఓటర్ల వింత చేష్టలు.. చెల్లకుండా పోయిన 23 వేల ఓట్లు
– కౌంటింగ్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్ అభ్యర్థి
– ఓటమి భయంతోనే ఆరోపణలన్న మల్లన్న

MLC Results: నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 4.30 సమయానికి మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో మూడవ రౌండ్ పూర్తయింది. ఈ తొలి ప్రాధాన్య ఓట్లలో 2,64,216 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. మూడవ స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 34,516 ఓట్లను దక్కించుకోగా, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన అశోక్‌గౌడ్‌కు 27,493 ఓట్లు పోల‌య్యాయి.

నాలుగు రౌండ్లుగా తొలి ప్రాధాన్యతా ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తొలి రౌండ్‌లో 7670, రెండో రౌండ్‌లో 7001, మూడో రౌండ్‌లో 4,208 ఓట్ల మెజార్టీ రాగా, మొత్తం 18,878 లీడ్ సాధించారు. తొలి మూడు రౌండ్‌లలో 2,88,000 ఓట్లను లెక్కించారు. కాగా చివ‌రి రౌండ్ అయిన నాలుగో రౌండ్‌లో 48,013 ఓట్లను లెక్కించనున్నారు. నాలుగో రౌండ్ తర్వాత చెల్లుబాటైన ఓట్లలో 50%+1 ఓటుతో గెలుపు కోటా నిర్ధారణ కానుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేతను నిర్ణయించే అవకాశం లేనందున ఇవాళ సాయంత్రం 7 గంటల తరువాత ఎలిమినేషన్ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేప‌ట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లల్లో విజేత ఎవ‌రో తేల‌నుంది. నేటి మధ్యాహ్నానికి అంతిమ ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఓటర్ల వింత చేష్టలు
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అనేక సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. పట్టభద్రులు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ పేపర్లపై ఓటు రూపంలో కాకుండా బొమ్మలు, రాతలు రూపంలో వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లపై ఓటర్ల చిత్ర, విచిత్రమైన రాతలు, గుర్తులు చూసి ఓట్లు లెక్కించే సిబ్బంది అవాక్కయ్యారు. చాలామంది పట్టభద్రులు బ్యాలెట్ పేపర్‌పై అంకెలు వేయాల్సింది పోయి.. జై మల్లన్న, జై రాకేష్ రెడ్డి, X గుర్తు పెట్టడం, పేర్లను అడ్డంగా కొట్టి వేయడం, జై కాంగ్రెస్, జై కేసీఆర్, ఐ లవ్ యూ, ‘ఎమ్మెల్సీలుగా ఈ అభ్యర్థి పనికిరాడు’ అంటూ నచ్చిన రాతలు రాశారు. కొన్ని బ్యాలెట్ పేపర్లపై కొందరైతే లవ్ గుర్తులను వేశారు. కొందరైతే ఏకంగా ఫోన్ పే నెంబర్లు రాసి డబ్బులు పంపించాలని కోరారు. మరికొందరైతే తమ సంతకాలను పెట్టారు. ఇంకొందరు ఖాళీ బ్యాలెట్ పేపర్లను అలాగే డబ్బాల్లో వేశారు. నేతలు, అభ్యర్థులపై అభిమానం ఉంటే ఓటు వేయాలి కానీ ఇలా గుర్తులు, రాతలతో చెల్లని ఓటుగా చేయడం పట్ల అధికారులు, రాజకీయ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్వాకంతో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 23 వేలకు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి.

ఈసారి గోల్‌మాల్ కుదరదు
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కౌంటింగ్ పారదర్శకంగా సాగటం లేదంటూ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి అభ్యతరం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నకు, తనకు లీడ్‌లో చాలా వ్యత్యాసం వస్తోందని, కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండానే అధికారులు ఫలితాలు ప్రకటిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో కలిసి బెదిరిస్తున్నారని తెలిపారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా తాను కౌంటింగ్‌ను తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు.

కాగా, బీఆర్ఎస్ అబ్యర్థి ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పందించారు. రాకేశ్ రెడ్డి మాటల్లో నిజం లేదని ఖండించారు. నిస్పాక్షికంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారుల పనితీరుపై గులాబీ పార్టీ అభ్యర్థి ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు తమ కంటే ముందుగా ఆ పార్టీ నేతలకే తెలుస్తున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని కేటీఆర్‌ ప్రయత్నించారని, గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడి అంతిమంగా విజయం సాధించారని, అదే మాదిరిగా ఈసారీ గోల్‌మాల్‌ చేసి గెలవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పట్టభధ్రుల చైతన్యం చూసి బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆరోపణలకు దిగారని తెలిపారు. వారి మాటలు వింటుంటే.. ఓటమిని ముందుగానే అంగీరించినట్లు తెలుస్తోందన్నారు.

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..